Income Tax Relief: సీనియర్ సిటిజన్లకు కేంద్రం షాక్.. ఆ ప్రతిపాదన లేదని స్పష్టీకరణ
కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో వివిధ వర్గాలకు కొన్ని ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా సీనియర సిటిజన్లకు అన్ని రంగాల్లో వివిధ రాయితీలను ఇస్తూ ఉంటారు. అయితే వారు పన్ను చెల్లింపుల విషయంలో కొన్ని మినహాయింపులను ఎప్పటినుంచో కోరుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం వారికి షాక్ ఇచ్చే వార్త చెప్పింది.
సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను రాయితీ కల్పించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు కోరుతూ అనేక ప్రతిపాదనలు, బడ్జెట్ కసరత్తులో భాగంగా ప్రతి సంవత్సరం స్వీకరిస్తారు. అయితే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో సీనియర్ సిటిజన్లకు సంబంధించిన మినాహాయింపుల వంటి ప్రతిపాదనలేవి పరిశీలనలో లేవని ఇటీవల పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధుల సంక్షేమ సంఘాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి సీనియర్ సిటిజన్ల కోసం ఆదాయపు పన్ను సవరణను కోరుతున్నాయా?, అలాగే సీనియర్ సిటిజన్లకు వార్షిక ఆదాయం రూ.7.5 లక్షల వరకు పన్ను రాయితీ కల్పించాలని, రూ.10 లక్షల వార్షిక ఆదాయం వరకు 5 శాతం ఆదాయపు పన్ను విధించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుందా?, సీనియర్ సిటిజన్ల జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం పెట్టుబడిపై పన్ను మినహాయింపు ఈ ఆర్థిక సంవత్సరం నుండి రూ. 1.5 లక్షల నుండి రూ. 3 లక్షలకు సవరించబడుతుందా? అని సభ్యులు అడిగిని ప్రశ్నలేవి ప్రతిపాదనల్లో లేవని స్పష్టం చేశారు.
నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ కోసం దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు విషయంలో స్పష్టత వచ్చిందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. జూలైలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం జూలైలో ఆవిష్కరించిన కేంద్ర బడ్జెట్‌లో అనేక పన్ను మార్పులను ప్రకటించింది. కొత్త పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులకు ఆర్థిక సంవత్సరంలో రూ. 17,500 వరకు పొదుపు ఉండేలా బడ్జెట్‌లో పన్ను రేటు నిర్మాణంలో కొన్ని మార్పులు చేశారు.
ఉద్యోగులకు లభించే స్టాండర్డ్ డిడక్షన్‌ను 50 శాతం పెంచి రూ. 75,000కి పెంచారు. పెన్షనర్లకు కుటుంబ పెన్షన్‌పై తగ్గింపును రూ. 15,000 నుండి రూ. 25,000కి పెంచారు. సుమారు నాలుగు కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు గత బడ్జెట్ చర్యలు తీసుకున్నారు. అలాంటి చర్యలేవి ఈ బడ్జెట్‌లో ఉండే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి