Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి వాడే పదాలకు అర్ధాలు తెలుసా?
Budget Glossary: పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జులై 22న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ సమర్పించనున్న ఆరో బడ్జెట్ ఇది. నరేంద్ర మోదీ సర్కారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది.
Budget Glossary: పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న వేళ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జులై 22న పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ సమర్పించనున్న ఆరో బడ్జెట్ ఇది. నరేంద్ర మోదీ సర్కారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగంలో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రెవెన్యూ రాబడులు, మొండి బకాయిలు తదితర ఆర్థిక అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పదాలు ప్రస్తావనకు వస్తాయి. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని అంశాలు మీకు అర్థంకావాలంటే ఈ కీలక పదాలు అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఇక్కడ బడ్జెట్ సమయంలో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చే కొన్ని పదాలకు అర్ధాలు వివరించే ప్రయత్నం చేస్తున్నాం.
వార్షిక ఆర్థిక నివేదిక (AFS)
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి సమర్పించే వార్షిక బడ్జెట్‌ను వార్షిక ఆర్థిక నివేదిక (AFS)అని కూడా పిలుస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల అంచనాలతో దీన్ని పార్లమెంటులో సమర్పిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదిక ముందుగా పార్లమెంటు ఆమోదించాలి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న దీన్ని పార్లమెంటుకు సమర్పిస్తారు. ఎన్నికల కారణంగా ఆ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పక్షంలో.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించాల్సి ఉంటుంది.
ఆర్థిక సర్వే
ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించే ప్రధాన పత్రం. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌కు ముందు సమర్పిస్తారు. ఆర్థిక సర్వే గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి సవివరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితితో పాటు ఆర్థిక దృక్పథాన్ని ఆర్థిక సర్వే ఆవిష్కరిస్తుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వే పత్రాన్ని సిద్ధం చేస్తుంది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించడానికి ఒక రోజు ముందు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ పత్రాన్ని సమర్పిస్తారు. మొదటి ఆర్థిక సర్వేను 1950-51 సంవత్సరంలో సమర్పించారు. 1964 వరకు దీనిని కేంద్ర బడ్జెట్‌తో పాటు సమర్పించేవారు.
ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణ రేటు సాధారణంగా శాతాలలో వ్యక్తీకరించడం జరుగుతుంది. అంతర్గత లేదా బాహ్య ఆర్థిక కారకాల కారణంగా కీలక వస్తువుల ధరలు పెరిగినప్పుడు, దానిని ద్రవ్యోల్బణం పెరుగుదలగా పేర్కొనవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుదల దేశ కరెన్సీ విలువ కొనుగోలు శక్తిలో తగ్గుదలని సూచిస్తుంది. ఈ పదానికి రిజర్వ్ బ్యాంక్ విధానాలతో ఎక్కువ సంబంధం ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి దిశగా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేస్తూ ఉంటుంది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈ పదాన్ని ప్రస్తావించడం జరుగుతుంది.
సెస్
సెస్ (Cess) అనేది నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం విధించే అదనపు పన్ను. సెస్ ద్వారా వచ్చే రాబడిని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంచబడుతుంది. దేశంలోని కొన్ని రకాల సెస్సుల్లో ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్, కృషి కళ్యాణ్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్ ఉన్నాయి.
అదనపు గ్రాంట్లు
అదనపు గ్రాంట్ అనేది ప్రభుత్వ అదనపు ఖర్చు డిమాండ్లను తీర్చడానికి కేటాయించిన అదనపు బడ్జెట్. బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ వ్యయ డిమాండ్లను తీర్చలేక పోయినప్పుడు, అదనపు బడ్జెట్ కోసం ఒక అంచనాను పార్లమెంటు ముందు సమర్పిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో అదనపు గ్రాంట్లు పార్లమెంటు ఆమోదించబడతాయి.
డిజిన్వెస్ట్‌మెంట్
పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) అనేది కేంద్ర ప్రభుత్వం PSUలో తన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించే ప్రక్రియ. ఇది ప్రభుత్వ పెట్టుబడి విధానానికి వ్యతిరేకమైన మార్గం. ఏళ్ల తరబడి ప్రభుత్వ రంగ సంస్థల్లో పోగైన ఆస్తులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. గత కొన్నేళ్లుగా ద్రవ్య లోటు అంతరాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలపై మొగ్గుచూపుతోంది. ఆ దిశగా బడ్జెట్‌లో ప్రభుత్వం పెట్టుబడి ఉపసంహరణల ప్రతిపాదనలు చేస్తుంది.
సర్‌ఛార్జ్ (Surcharge)
సర్‌చార్జ్ అనేది ఒక వస్తువు లేదా సేవలకు నిర్దేశించిన ధరకు మించి జోడించబడే అదనపు రుసుము లేదా పన్ను. సమాజంలో సమానత్వం తీసుకొచ్చే లక్ష్యంతో ఇది సాధారణంగా ధనవంతుల నుంచి వసూలు చేయబడుతుంది. ప్రభుత్వ సంక్షేమ విధాన నిర్ణయాలకు ధనవంతులు సహకరించాల్సి ఉంటుంది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు ధనికులు సర్‌ఛార్జ్‌లు చెల్లించాల్సి ఉంటుంది.
కస్టమ్స్ డ్యూటీ
కస్టమ్స్ సుంకం అనేది నిర్దిష్ట వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు/ఎగుమతి చేసినప్పుడు విధించే ఒక రకమైన పన్ను. ఈ కస్టమ్స్ డ్యూటీ బారాన్ని చివరికి వినియోగదారుడికి బదిలీ అవుతాయి. కస్టమ్స్ సుంకం వస్తు సేవల పన్ను (GST) పరిధికి వెలుపల ఉన్నందున.. ప్రభుత్వం తన బడ్జెట్‌లో ఇందులో మార్పులను ప్రకటించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో కీలకమైన అంశమైన కస్టమ్స్ డ్యూటీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ప్రకటన కోసం చాలా రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి.
వస్తు సేవల పన్ను
కస్టమ్స్ సుంకంలా వస్తు సేవల పన్ను (GST)లో మార్పులను బడ్జెట్‌లో ప్రకటించలేదు. GST స్లాబ్‌లు మార్పులపై GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో GST గురించి ప్రస్తావించినా.. ఇందులో ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేరు. అందుకే బడ్జెట్‌లో జీఎస్టీకి సంబంధించి ఎటువంటి మార్పులు ప్రకటించే అవకాశం ఉండదు.
రెవెన్యూ లోటు
ప్రభుత్వ బడ్జెట్‌లో నికర ఆదాయం, వ్యయ అంచనాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. బడ్జెట్ రాబడులు, వ్యయాల మధ్య ఏర్పడిన వ్యత్యాసాన్ని ఇది సూచిస్తుంది. ప్రభుత్వం తన సాధారణ ఆదాయం నుంచి అధికంగా ఖర్చు చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇది కీలక సూచికగా పరిగణించబడుతుంది.
రెవెన్యూ మిగులు
రెవెన్యూ మిగులు అనేది రెవెన్యూ లోటుకు వ్యతిరేకం. ప్రభుత్వ నికర ఆదాయ అంచనాలు వ్యయం కంటే ఎక్కువగా ఉంటే రెవెన్యూ మిగులు ఏర్పడుతుంది.
కరెంట్ అకౌంట్ లోటు
కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD) అనేది దేశ వాణిజ్యం కొలమానంగా ఉంటుంది. దిగుమతి చేసుకున్న వస్తువులు, సేవల విలువ ఎగుమతుల విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ అకౌంట్ లోటు ఏర్పడుతుంది. ఇది దేశ చెల్లింపుల బ్యాలెన్స్‌లో ఒక భాగంగా ఉంటుంది.
యూనియన్ బడ్జెట్
యూనియన్ బడ్జెట్ అనేది వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక దేశ రాబడి, ఖర్చుల అంచనాను తెలిపే పత్రం. ఒక దేశ ఆర్థిక ప్రణాళికగా యూనియన్ బడ్జెట్ పరిగణించబడుతుంది. వివిధ ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖలకు నిర్దిష్ట మొత్తాన్ని నిర్ణయించి కేటాయింపులు చేయబడుతాయి. 2024 యూనియన్ బడ్జెట్‌ను జులై 22న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు.
బడ్జెట్ 2024కు సంబంధించిన మరిన్ని కథనాలు చదవండి..