రివ్యూ పిటిషన్లపై విచారణకు ‘నో ‘.. అయితే..? ‘సుప్రీం’ అసాధారణ నిర్ణయం !
శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు.. అసాధారణ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తాము వీటిని విచారించబోమని, అయితే ఇదివరకటి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తిన 7 అంశాలను పరిశీలిస్తామని సీజేఐ ఎస్.ఎ. బాబ్డే ఆధ్వర్యాన ఏర్పాటైన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా.. మత సంబంధమైన ఇతర అంశాలకు సంబంధించి ఆయా సమస్యలను ఒకే గాటన కట్టే విషయమై ఒక నిర్ణయం […]

శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు.. అసాధారణ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తాము వీటిని విచారించబోమని, అయితే ఇదివరకటి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తిన 7 అంశాలను పరిశీలిస్తామని సీజేఐ ఎస్.ఎ. బాబ్డే ఆధ్వర్యాన ఏర్పాటైన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా.. మత సంబంధమైన ఇతర అంశాలకు సంబంధించి ఆయా సమస్యలను ఒకే గాటన కట్టే విషయమై ఒక నిర్ణయం తీసుకునేందుకు అన్ని పార్టీలకూ (పక్షాలకూ) ఈ ధర్మాసనం మూడు వారాల గడువునిచ్చింది. ఇందుకు అనువుగా లాయర్లంతా ఈ అంశంపై చర్చించేందుకు వారి చేత ఈ నెల 17 న సమావేశం ఏర్పాటు చేయించాలని కోర్టు…. సెక్రటరీ జనరల్ ను ఆదేశించింది.
శబరిమల గుడిలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించాలని గతంలో అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రూలింగ్ ఇవ్వగా దాన్ని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మత సంబంధమైన విషయాల్లో తాము ఎంతవరకు జోక్యం చేసుకోవచ్ఛునన్న అంశాన్ని విస్తృత బెంచ్ మొదట నిర్ణయించనుంది. ఈ పోకడను రాజ్యాంగ పరిధిలో చూడాల్సిఉందని బెంచ్ అభిప్రాయపడింది. కాగా- గతంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. ఇది మతానికి, విశ్వాసానికి సంబంధించినదని, అత్యంత సునిశితమైన ఈ అంశాన్ని పరిశీలించేందుకు విస్తృత రాజ్యాంగ ధర్మాసనమే తగినదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇతర మతాల వారి ప్రార్థనా మందిరాల్లో మహిళల అనుమతికి, లేదా నిషేధానికి సంబంధించిన అంశాన్ని కూడా అధ్యయనం చేయవలసి ఉందని ఆ ధర్మాసనం అభిప్రాయపడింది.



