ఇటు ఏపీ స్టార్- అటు మెగాస్టార్.. మధ్యలో పవర్ స్టార్! ఆసక్తి రేపుతున్న సైరాతో భేటీ

ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి కలయిక. సోమవారం ఏపీ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ చిత్రం ఆవిష్కరణ కాబోతుంది. ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన వైసీపీకి బాస్ ఒకరు. చలన చిత్ర పరిశ్రమకు ఆయనను మించిన స్టార్ మరొకరు. ఈ ఇద్దరి భేటీ ఎన్నో చర్చలకు తెరలేపుతోంది. ఈ ఇద్దరు లెజెండ్స్ సోమవారం సీఎం జగన్ నివాసంలో భేటీ కానున్నారు. అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ దాదాపు మూడు వేల కిలోమీటర్లు సుధీర్ఘ పాదయాత్ర చేసి […]

ఇటు ఏపీ స్టార్- అటు మెగాస్టార్.. మధ్యలో పవర్ స్టార్!  ఆసక్తి రేపుతున్న సైరాతో భేటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 13, 2019 | 3:58 PM

ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి కలయిక. సోమవారం ఏపీ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ చిత్రం ఆవిష్కరణ కాబోతుంది. ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిన వైసీపీకి బాస్ ఒకరు. చలన చిత్ర పరిశ్రమకు ఆయనను మించిన స్టార్ మరొకరు. ఈ ఇద్దరి భేటీ ఎన్నో చర్చలకు తెరలేపుతోంది. ఈ ఇద్దరు లెజెండ్స్ సోమవారం సీఎం జగన్ నివాసంలో భేటీ కానున్నారు.

అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ దాదాపు మూడు వేల కిలోమీటర్లు సుధీర్ఘ పాదయాత్ర చేసి ప్రతి మనిషిని ఆప్యాయతతో పలకరించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి కూడా తన అభిమానులకు ఎంతో ప్రేరణగా నిలిచి రక్తదానం, నేత్రదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయంగా ఈ ఇద్దరూ గతంలో ఒకే పార్టీనుంచి వచ్చిన వారే. అంతకు ముందు చిరంజీవి సినీ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్నకాలంలో సినిమాలను తృణప్రాయంగా వదలుకుని రాజకీయారంగ ప్రవేశం చేశారు. సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 శాతం ఓట్లు సాధించి 18 మంది ఎమ్మెల్యేలను సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దాంతో చిరంజీవి ఏకంగా కేంద్ర పర్యాటక మంత్రిగా కూడా పదవిని అలంకరించారు. ఇక వైఎస్ జగన్ తన తండ్రి దివంగత వైఎస్సార్ అకాల మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలితో ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. ఆ వెనువెంటనే జగన్.. సొంతపార్టీని స్ధాపించారు. ఆనాటి నుంచి అధికారం చేపట్టే వరకు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాపోరాటాలతో ప్రజల మనసులను గెలుచుకుని ఏకంగా ప్రస్తుతం ఏపీకి సీఎం కాగలిగారు.

రాజకీయాలు చిరంజీవిలో అసంతృప్తిని మిగిల్చాయి. అయితే ప్రస్తుతం ఆయన పాలిటిక్స్‌కు దాదాపు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల విడుదలైన సంచలనం సృష్టిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీతో చిరులో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆయన ఎప్పటికీ మెగాస్టారే అనే విషయాన్నిఆ మూవీ మరోసారి రుజువు చేసింది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరు తాజాగా ఏపీ సీఎం జగన్‌తో జరగనున్న భేటీ ఎంతో ఆసక్తిని రేపుతుంది. ఇంతకీ వీరిద్దరూ ఏ కారణంతో భేటీ అవుతున్నారు? దీనివెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా? రహస్య ఎజెండా ఏదైనా ఉందా? అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. వీరిద్దరి భేటీ రాజకీయాలకు సంబంధించిందా? లేక కేవలం సైరా సినిమాకు సంబంధించిందా? అనే విషయాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. చిరంజీవిని దైవంగా భావించే మరో వ్యక్తి ఉన్నారు. ఆయనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇటు సీఎం జగన్, అటు చిరుల భేటీపై పవన్ ఎలా స్పందిస్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసి ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేశారు. ఇక 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిపి జనసేన నేరుగా ఎన్నికల్లో పోటీ చేసింది. వైసీపీని టార్గెట్‌గా చేసుకుని పవన్ చేయని విమర్శ లేదు. సీఎం జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రచారం చేశారు పవన్. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా పవన్‌కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. కేవలం టీడీపీ చెప్పినట్టు నడుచుకునే పెయిడ్ ఆర్టిస్టు అంటూ విమర్శించారు.

ఇప్పుడు సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై ఆసక్తి రేగుతోంది. వీరిద్దరి కలయిపై పవన్ ఎలా స్పందిస్తారో అనేది ఉత్కంఠను రేపుతోంది. ప్రస్తుతం పవన్ ఉత్తరాఖండ్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఎంతమంది అభిమానులు ఉన్నారో.. చిరంజీవిని అభిమానించే వారు అంతకంటే ఎక్కువే ఉంటారు. ముఖ్యంగా చిరు సామాజిక వర్గం కూడా ఏపీ రాజకీయాల్లో కీలకమే. సోమవారం జరగనున్న ఈ భేటీ రాజకీయమా? లేక సైరా మూవీకి సంబంధించిందా అనేది మాత్రం తెలియదు. ఏది ఏమైనా వీరిద్దరి భేటీలో ఎజెండాలో లేని ఎన్నో విషయాలు చర్చకు వచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.