Sun Transit 2023: వృషభ రాశిలోకి రవి గ్రహ సంచారం.. వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..

Surya Gochar 2023: ప్రస్తుతం తన మిత్ర క్షేత్రం, తన ఉచ్ఛ క్షేత్రం అయిన మేష రాశిలో సంచరిస్తున్న రవి గ్రహం 16వ తేదీ(మంగళవారం) నుంచి వృషభ రాశిలో సంచరించడం ప్రారంభం అవుతుంది. సాధారణంగా రవి రాశి మారటం వల్ల జీవితంలో తప్పకుండా ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటుంది.

Sun Transit 2023: వృషభ రాశిలోకి రవి గ్రహ సంచారం.. వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..
Sun Transit 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 15, 2023 | 6:40 PM

Surya Gochar: ప్రస్తుతం తన మిత్ర క్షేత్రం, తన ఉచ్ఛ క్షేత్రం అయిన మేష రాశిలో సంచరిస్తున్న రవి గ్రహం 16వ తేదీ(మంగళవారం) నుంచి వృషభ రాశిలో సంచరించడం ప్రారంభం అవుతుంది. సాధారణంగా రవి రాశి మారటం వల్ల జీవితంలో తప్పకుండా ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటుంది. గ్రహాలకు రాజు అయినటువంటి రవి గ్రహం వృషభ రాశి వంటి స్థిర రాశిలో ప్రవేశించి నెల రోజులు ఉండటం దాదాపు అన్ని రాశుల వారి జీవితాలలోనూ కొద్దో గొప్పో మార్పు తీసుకురావడం జరుగుతుంది. రవి రాశి మార్పు ఒక్కో రాశి వారికి ఏ విధంగా ఫలితం ఇస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.

  1. మేష రాశి: ఈ రాశి వారికి రెండవ స్థానంలో ఈనెల 16వ తేదీ నుంచి రవి సంచారం ప్రారంభం కావడం వల్ల సాధారణంగా ఆర్థిక, కుటుంబ సమస్యలకు పరిష్కారం మొదలవుతుంది. ఈ రాశి వారికి డబ్బు పరంగా ఏవైనా సమస్యలు ఉన్న పక్షంలో అవి వాటంతటవే పరిష్కారం కావడం జరుగు తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవలసి ఉన్నా లేక కుటుంబ పరంగా కలతలు ఏమైనా ఉన్నా అవి ఒక కొలిక్కి రావటం జరుగుతుంది. అటు బంధువులలోనూ ఇటు కుటుంబంలోనూ మాటకు విలువ పెరుగుతుంది. మాట చెల్లు బాటు అవుతుంది.
  2. వృషభ రాశి: రవి ఈ రాశి లోనే ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనారోగ్యాలు నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. తల్లిదండ్రులతో సామరస్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ముఖ్యంగా తండ్రి వల్ల అనుకోని ప్రయోజనం ఏదో అనుభవానికి వస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడటానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా సుఖ సంతోషాలు అభివృద్ధి చెందుతాయి.
  3. మిథున రాశి: ఈ రాశి వారికి ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. ఆస్తి విషయాలలో తోబుట్టువుల నుంచి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల మున్ముందు కొన్ని ప్రయోజనాలు ఒనగూడే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందే సూచనలు ఉన్నాయి. మొండి బాకీలు వసూలు కావచ్చు. శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ వల్ల కొందరు స్నేహితులు లబ్ధి పొందుతారు.
  4. కర్కాటక రాశి: ఈ రాశి వారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి సంస్థలు స్థిరపడతారు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగు తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడతాయి. సామాజిక సేవ, వితరణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. అర్ధాష్టమ శని ప్రభావం చాలావరకు తగ్గుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: ఈ రాశికి నాధుడైన రవిగ్రహం ఈ రాశికి దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగ పరంగా సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఉద్యోగం లభించడం జరుగుతుంది. ఉద్యోగంలో మంచి మార్పు కోరుకుంటున్న వారికి అటువంటి మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. గృహ యోగానికి అవకాశం ఉంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి.
  7. కన్యా రాశి: ఈ రాశి వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం జరుగుతుంది. విదేశీ యానానికి అవకాశం ఉంది. వీసా సమస్యలు ఏవైనా ఉంటే అవి అనాయాసంగా పరిష్కారం అవుతాయి. తండ్రితో సఖ్యత ఏర్పడుతుంది. తండ్రి నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ పరంగా శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య సంబంధంగా ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది.
  8. తులా రాశి: ఈ రాశి వారికి రవి గ్రహం అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ అదృష్ట యోగం పట్టడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మూలకంగా ఆస్తి కలిసి రావడం, సంపద పెరగటం, జీవిత భాగస్వామి మంచి ఉద్యోగంలో ప్రవేశించడం లేదా మంచి ఉద్యోగంలోకి మారడం, సంపాదన పెరగటం వంటి అంశాలలో ఒకటి రెండు అయినా తప్పకుండా జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ పెద్దల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. స్నేహితులతో కానీ బంధువులతో కానీ కొద్దిగా అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది.
  9. వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఉద్యోగ పరంగా అభివృద్ధికి అవకాశం ఉంది. గౌర వ మర్యాదలు పెరుగుతాయి. ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువుల నుంచి మేలు జరుగుతుంది. కొన్ని మంచి పరిచయాలతో పాటు అనవసర పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు.
  10. ధనుస్సు రాశి: ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఆశించిన స్థాయిలో ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అయితే ప్రస్తుతానికి ఆర్థికపరంగా ఎవరికైనా వాగ్దానం చేయడం కానీ, హామీ ఉండటం కానీ చేయకపోవడం మంచిది. ఉద్యోగ పరంగా ప్రత్యేక బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.
  11. మకర రాశి: ఈ రాశి వారు సంతాన పరంగా శుభవార్తలను వినే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగానికి అవకాశం ఉంది. ఈ రాశి వారి నిర్ణయాలు ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. మంచి మిత్రులు పరిచయం అవుతారు. కుటుంబంలో శుభకార్యం జరగవచ్చు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారి సలహాలు సూచనలు అధికారులకు లేదా యజమానులకు ప్రయోజనం కలిగిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది.
  12. కుంభ రాశి: ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాలు లేదా విభేదాలు ఏవైనా ఉన్నపక్షంలో అవి పరి ష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాములు కూడా కలసి వస్తారు. వృత్తి జీవితంలో ఉన్నవారు మంచి గుర్తింపు పొందుతారు. వృత్తి జీవితం బిజీగా మారిపోతుంది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో కూడా ఖర్చు పెరుగుతుంది. కొందరు స్నేహితులకు లేదా దగ్గర బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.
  13. మీన రాశి: మీ రాశి వారు ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి తప్పకుండా సఫలం అవుతాయి. ఉద్యోగం లోనే కాకుండా కుటుంబంలో కూడా చిన్న ప్రయ త్నంతో ఎక్కువగా ప్రయోజనాలు పొందే అవ కాశం ఉంది. ప్రయాణాల వల్ల అధికంగా లాభం పొందడం జరుగుతుంది. నిరుద్యోగులు అవివా హితలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ పరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. ఆవేశ కావేషాలను తగ్గించుకుని ఓర్పు సహనాలను పాటిస్తే అంతా మంచే జరుగుతుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..