Telugu Astrology: మూడు గ్రహాల యుతి…ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
నవంబర్ 16-24 మధ్య వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ గ్రహాల యుతి ఐదు రాశుల జీవితాలను మార్చనుంది. ఈ రాజయోగకారక సంయోగం వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశులకు అదృష్టం, ఐశ్వర్యం, వృత్తి విజయం తెస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనూహ్య విజయాలు సొంతం చేసుకుంటారు. ఆయా రాశుల వారిపై ఏ రకమైన ప్రభావం ఉంటుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

Wealth And Success Astrology
ఈ నెల(నవంబర్) 16 నుంచి 24వ తేదీ వరకు వృశ్చిక రాశిలో మూడు ప్రధాన గ్రహాలు యుతి చెందబోతున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ రాశిలో ఎక్కువ గ్రహాలు కలిసినా దానికి తప్పకుండా విశేషం ఉంటుంది. వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు కలవడం కొన్ని రాశులవారి జీవితాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. రాజయోగకారక గ్రహమైన రవి, అధికార యోగకారక గ్రహమైన కుజుడు, తెలివితేటలకు, వ్యూహాలకు, ప్రణాళికలకు కారకుడైన బుధుడు కలవడం వల్ల వృషభం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది.
- వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి, బుధ, కుజుల యుతి వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆదాయాన్ని సరైన రీతిలో మదుపు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడు కావడానికి అవకాశాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు తప్ప కుండా అనుకున్నది సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో విశేషమైన ప్రతిభ కనబరచి అందలాలు ఎక్కుతారు.
- సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాశ్యధిపతి రవి తన మిత్ర గ్రహాలైన కుజ, బుధులతో యుతి చెందడం రాజయోగాలకు కారణమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన యోగాలు పడతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి ధన స్థానంలో రవి, బుధులు కలవడమే ఒక విశేషం కాగా, వాటితో కుజుడు కూడా కలవడం మరో విశేషం. సరికొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుని పొదుపు పాటిస్తారు. ఆర్థిక లాభం లేనిదే ఏ పనినీ చేపట్టే అవకాశం ఉండదు. రావలసిన సొమ్మును, బాకీలను పూర్తిగా రాబట్టుకుంటారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లోనే కాక, ఆర్థిక లావాదేవీల్లో కూడా జాగ్రత్తలు పెరుగుతాయి.
- వృశ్చికం: ఈ రాశిలో కుజ, రవులతో బుధుడు కలవడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభకు, సమర్థతకు గుర్తింపు లభించే పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో బిజీగా సాగిపోతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. సంపన్న వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది.
- మకరం: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి కుజుడితో సహా మూడు గ్రహాలు యుతి చెందడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సొంత ఇంటికి, విదేశాల్లో ఉద్యోగానికి ప్రయత్నించడం చాలా మంచిది. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. జీవనశైలి పూర్తిగా మారి పోతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు.



