- Telugu News Photo Gallery Spiritual photos Marriage and Love Forecast: Venus in Libra and Jupiter in Cancer Bless 5 zodiac signs Telugu Astrology
Marriage Astrology: తులా రాశిలో శుక్రుడు…ఈ రాశుల వారికి వివాహ యోగం! ఇందులో మీ రాశి ఉందా?
స్వక్షేత్రమైన తులా రాశిలో శుక్రుడు సంచారం చేయడం అనేక విధాలుగా ప్రాధాన్యం సంతరించు కుంది. పెళ్లిళ్లు జరగడానికి, ప్రేమ ప్రయత్నాలు సఫలం కావడానికి, ఆదాయం పెరగడానికి, సుఖ సంతోషాలు వృద్ధి చెందడానికి, వైవాహిక జీవితం హ్యాపీగా సాగిపోవడానికి శుక్రుడు అవకాశాలనిస్తాడు. ఇక కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల శుభ కార్యాలు జరగడానికి, కొత్త జీవితం ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. డిసెంబర్ మొదటి వారం వరకు ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మేషం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి శుభ కార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
Updated on: Nov 08, 2025 | 5:17 PM

మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో, అంటే పెళ్లిళ్లు, ప్రేమలకు సంబంధించిన స్థానంలో, శుక్రుడి సంచారం, సుఖ సంతోషాలకు సంబంధించిన చతుర్థ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి త్వరలో తప్పకుండా వివాహ యోగం పట్టే అవకాశం ఉంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరిగి దాంపత్యం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, చతుర్థ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల కొద్ది ప్రయత్నంతో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. దూరపు బంధువులతో పెళ్లి ఖాయ మయ్యే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. గురువు ఉచ్ఛ స్థితి వల్ల సాధారణంగా ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెళ్లయినవారి జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. వైవాహిక సమస్యలన్నీ సమసిపోయి, కొత్త జీవితం ఏర్పడుతుంది.

కన్య: ఈ రాశికి కుటుంబ స్థానంలో కుటుంబ స్థానాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి తప్ప కుండా కుటుంబ జీవితం ప్రారంభం అవుతుంది. లాభ స్థానంలో గురువు, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో అనుకోకుండా పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడు, దశమ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారికి వైభవోపేతమైన వైవాహిక జీవితం ఏర్పడుతుంది. కోరుకున్న వ్యక్తితో లేదా ప్రేమించిన వ్యక్తితో ఆడంబరంగా వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోవడమే కాకుండా తప్పకుండా పెళ్లికి దారి తీస్తాయి. వివాహానంతరం విదేశీ జీవితం ఏర్పడడానికి బాగా అవకాశం ఉంది. ఇక వైవాహిక జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది.

మకరం: శుభ కార్యాలకు కారకుడైన గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టడం, ప్రేమలు, పెళ్లిళ్లు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు దశమ స్థానంలో, స్వస్థానంలో సంచారం చేస్తుండడం వల్ల సాధారణంగా సహోద్యోగితో లేదా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందినవ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు అత్యంత ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. దాంపత్య జీవితంలో సామరస్యం, అన్యోన్యత పెరుగుతాయి.



