AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friday the 13th: శుక్రవారం 13వ తేదీ అంటే నిజంగానే అశుభమా? న్యూమరాలజీ ఏం చెబుతోంది?

Friday the 13th Meaning Telugu: శుక్రవారం 13వ తేదీ అంటే చాలామంది అశుభంగా భావిస్తారు. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడానికి కూడా వెనుకాడుతుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం 13 సంఖ్య నిజంగా దురదృష్టానికి సంకేతమా? టారో కార్డుల్లో ఈ సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Friday the 13th: శుక్రవారం 13వ తేదీ అంటే నిజంగానే అశుభమా? న్యూమరాలజీ ఏం చెబుతోంది?
Friday The 13th Meaning Telugu
Rajashekher G
|

Updated on: Nov 13, 2026 | 6:00 AM

Share

Friday the 13th Meaning Telugu: శుక్రవారం 13వ తేదీ వస్తుందంటే చాలు.. చాలామంది కొంత ఆందోళనకు గురవుతుంటారు. ఈ రోజున ప్రయాణాలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, ఒప్పందాలపై సంతకాలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని భావిస్తారు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ తేదీని దురదృష్టానికి సంకేతంగా చూస్తారు. అయితే నిజంగానే శుక్రవారం 13వ తేదీ అశుభమైన రోజా? లేక తరతరాలుగా వస్తున్న నమ్మకాల వల్ల మనలో భయం ఏర్పడిందా? దీనిపై న్యూమరాలజీ నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు.

13వ తేదీపై భయం ఎలా మొదలైంది?

శుక్రవారం 13వ తేదీని అశుభంగా భావించడం వెనుక ఒకే ఒక్క కారణం లేదు. క్రైస్తవ సంప్రదాయంలోని చివరి విందులో 13 మంది పాల్గొనడం, వారిలో జుడాస్ 13వ వ్యక్తిగా ఉండటం, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రావడం వంటి కథనాలు ఈ నమ్మకానికి కారణమని చెబుతారు. అలాగే 1307 అక్టోబర్ 13న శుక్రవారం రోజున నైట్స్ టెంప్లర్ సభ్యులను అరెస్టు చేయడం కూడా ఈ మూఢనమ్మకంతో ముడిపడి ఉంది. 1907లో వచ్చిన ‘Friday, the Thirteenth’ నవల, ఆ తర్వాత విడుదలైన హారర్ సినిమాలు ఈ భయాన్ని మరింత పెంచాయి.

న్యూమరాలజీ ప్రకారం 13 సంఖ్య ప్రత్యేకత ఏమిటి?

న్యూమరాలజీ ప్రకారం 13 సంఖ్యను కలిపితే 4 వస్తుంది (1+3=4). ఈ సంఖ్య క్రమశిక్షణ, పట్టుదల, బలమైన పునాదులకు సంకేతంగా భావిస్తారు. పాత అలవాట్లను విడిచిపెట్టి కొత్త మార్గంలో ముందుకు వెళ్లాలని ఇది సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే 13లోని 1 సంఖ్య సూర్యుడిని, 3 సంఖ్య గురు గ్రహాన్ని సూచిస్తాయని చెబుతారు. శుక్రవారం అధిపతి శుక్రుడు కావడంతో ఈ రోజున సృజనాత్మకత, కొత్త ఆలోచనలు, మార్పులకు సిద్ధపడే గుణం ప్రాధాన్యత సంతరించుకుంటాయని నమ్ముతారు. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

టారో కార్డుల్లో 13వ సంఖ్య అర్థం ఇదే!

టారో కార్డుల్లో 13వ కార్డును ‘డెత్ కార్డ్’గా పిలుస్తారు. అయితే దీని అర్థం మరణం అని కాదు. జీవితంలో ఒక అధ్యాయం ముగిసి, మరో కొత్త అధ్యాయం ప్రారంభం కావడాన్ని ఇది సూచిస్తుంది. పాత ఆలోచనలు, అలవాట్లను వదిలి కొత్త మార్పులను స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుందని టారో నిపుణులు వివరిస్తున్నారు.

ఈ రోజున పాటించాల్సిన ఐదు సూచనలు

  1. పాత అలవాట్లను వదలండి: మీకు ఉపయోగపడని మూడు అలవాట్లను గుర్తించండి.
  2. కొత్త లక్ష్యాలు పెట్టుకోండి: సాధించాలనుకునే ఐదు విషయాలను రాసుకోండి.
  3. కృతజ్ఞతతో ఉండండి: మీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చిన 13 విషయాలను గుర్తు చేసుకోండి.
  4. ధ్యానం చేయండి: 11 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయండి.
  5. మంచి పని ప్రారంభించండి: మీ లక్ష్యానికి దగ్గర చేసే ఒక చిన్న పనిని ఆచరణలో పెట్టండి.

శుక్రవారం 13న ఏ పనులైనా చేయవచ్చా?

శుక్రవారం 13వ తేదీన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, దురదృష్టం వెంటాడుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి ఈ తేదీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఏ రోజైనా సరే ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా చదవడం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.

మొత్తానికి.. ఒక తేదీ మన భవిష్యత్తును నిర్ణయించదు. మన ఆలోచనలు, నిర్ణయాలు, చేసే పనులే మన జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి శుక్రవారం 13వ తేదీని అశుభంగా భావించి భయపడకుండా, కొత్త మార్పులకు నాంది పలికే రోజుగా చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు న్యూమరాలజీ, టారో కార్డులు, జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ నిర్ధారణ లేదు. పాఠకులు వీటిని కేవలం సమాచారం, నమ్మకాల కోణంలో మాత్రమే పరిగణించాలి.)

మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us