Rolls Royceకు పోటీగా కారు.. వినడానికి వింతగా ఉన్నా రేంజ్, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే
లగ్జరీ కార్ల మార్కెట్లో Rolls-Royce వంటి బ్రాండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అత్యాధునిక ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కార్లు సంపన్నులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD కూడా ఈ విభాగంలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. తన అల్ట్రా లగ్జరీ బ్రాండ్ Yangwang కింద Atelier పేరుతో సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ లిమోజిన్‌ను ఆవిష్కరించింది. అబుదాబిలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కారును తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది.

భారీ కొలతలు, ప్రత్యేకమైన డిజైన్, ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే క్యాబిన్, అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ Atelier కారు ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని BYD వెల్లడించింది. నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు, సెకండ్ జనరేషన్ బ్లేడ్ బ్యాటరీతో వస్తున్న ఈ లిమోజిన్ లగ్జరీ కార్ల విభాగంలో ఆసక్తిని పెంచుతోంది. దీని డిజైన్, ఫీచర్లు, పనితీరు గురించి తెలుసుకుందాం.
విలాసవంతమైన క్యాబిన్
BYD Yangwang Atelier పొడవు 5,600 మి.మీ., వెడల్పు 2,030 మి.మీ., ఎత్తు 1,590 మి.మీ. కాగా, వీల్‌బేస్ 3,500 మి.మీ.గా ఉంది. దీని డిజైన్‌లో బ్రిటిష్ లగ్జరీ కార్ల శైలితో పాటు ప్రాచీన చైనా సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. చైనాలో పండుగల సమయంలో ఉపయోగించే ‘డింగ్’ అనే కంచు పాత్ర ఆకారం నుంచి స్ఫూర్తి పొంది హెడ్‌లైట్లను రూపొందించారు. ఇందులో 12 ప్రత్యేక లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. పెద్ద గ్రిల్, ప్రత్యేక లోగో, కోచ్ డోర్లు, డ్యూయల్ టోన్ పెయింట్, 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
నాలుగు సీట్లతో రూపొందించిన క్యాబిన్‌లో ప్రీమియం లెదర్, నేచురల్ వుడ్ ప్యానెల్స్, ఉన్ని ఫ్లోర్ మ్యాట్స్ అందించారు. వెనుక ప్రయాణికుల కోసం జీరో గ్రావిటీ సీట్లు, పవర్డ్ లెగ్ రెస్ట్స్, మసాజ్ ఫంక్షన్ ఉన్నాయి. 21.4 అంగుళాల ఓవర్‌హెడ్ స్క్రీన్, 39 స్పీకర్ల Dynaudio సౌండ్ సిస్టమ్, ముందు వెనుక రిఫ్రిజిరేటర్ కంపార్ట్‌మెంట్లు ప్రత్యేకతలు. డోర్లలో గొడుగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు 532 లీటర్ల లగేజ్ స్పేస్ కూడా ఇచ్చారు.
1,000 కి.మీ.కు పైగా రేంజ్..
పనితీరు విషయానికి వస్తే Yangwang Atelierలో BYD సెకండ్ జనరేషన్ Blade LFP బ్యాటరీని ఉపయోగించారు. దీని సామర్థ్యం 100 kWh కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఒక్కసారి ఛార్జింగ్‌తో 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. Flash Charging టెక్నాలజీకి కూడా ఈ కారు సపోర్ట్ చేస్తుంది. ఇందులోని నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు 1,000 bhp కంటే ఎక్కువ పవర్‌ను అందించే అవకాశం ఉంది.
DiSus యాక్టివ్ సస్పెన్షన్, Tank Turn ఫీచర్‌తో పాటు టైర్ పంక్చర్ అయినా వాహనాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక టెక్నాలజీని అందించారు. అత్యవసర పరిస్థితుల్లో నీటిపై తేలే సామర్థ్యం కూడా ఉందని BYD తెలిపింది. ఇక భారత్‌లో BYD ప్రస్తుతం Yangwang లగ్జరీ కార్లను విక్రయించడం లేదు. గతంలో ఢిల్లీ మోటార్ షోలో U8 లగ్జరీ SUVని ప్రదర్శించింది. అయితే Yangwang Atelier భారత మార్కెట్లోకి వస్తుందా? వస్తే ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అనే వివరాలపై ఇంకా స్పష్టత లేదు.
