AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayasai Reddy: సోనియా షూ లేసులు కట్టిన రాహుల్ గాంధీ.. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏమని స్పందించారంటే?

రాహుల్ తల్లి సోనియా గాంధీ షూలేస్‌లను మార్గమధ్యంలో కడుతున్న ఫొటోలు, వీడియోలు రోజంతా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వీటిపై వివిధ వర్గాల నుంచి భిన్న రకాల స్పందనలు, రియాక్షన్లు వస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వీటిపై స్పందించారు.

Vijayasai Reddy: సోనియా షూ లేసులు కట్టిన రాహుల్ గాంధీ.. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఏమని స్పందించారంటే?
Vijayasai Reddy, Rahul Gand
Basha Shek
|

Updated on: Oct 08, 2022 | 6:25 AM

Share

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. తల్లీ కొడుకులిద్దరూ కలిసి కాసేపు పాదయాత్ర చేశారు. ఈ సమయంలో రాహుల్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రాహుల్ తల్లి సోనియా గాంధీ షూలేస్‌లను మార్గమధ్యంలో కడుతున్న ఫొటోలు, వీడియోలు రోజంతా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వీటిపై వివిధ వర్గాల నుంచి భిన్న రకాల స్పందనలు, రియాక్షన్లు వస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వీటిపై స్పందించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ‘ ‘భారత్‌ జోడో’ యాత్ర సందర్భంగా కర్ణాటక మండ్య జిల్లా బెళ్లాలె గ్రామంలో తన తల్లి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీ షూ లేసులు ఊడిపోతే కుమారుడు రాహుల్‌ గాంధీ గారు వాటిని సరిచేయడం నిన్నటి నుంచి ఆసక్తికర వార్తగా మారింది. గురువారం తన పాదయాత్రలో పాల్గొన్న తల్లి బూటు లేసులు కట్టడానికి రాహుల్‌ మోకాళ్లపై కూర్చుని పని పూర్తిచేశారు. ఈ కమనీయ దృశ్యం చూపరులకు కన్నీళ్లు పెట్టించలేదు కానీ, లక్షలాది మంది మనసులకు హత్తుకుందని పత్రికలు తెలిపాయి’

తల్లీ, చెల్లీ మాత్రమే కాదు రాహుల్‌ జీ..

‘నిజమే, చాలా కాలంగా కొవిడ్‌ తదితర ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్న సోనియా జీ తన కోసం వందలాది కిలోమీటర్లు విమానంలో ప్రయాణించి వచ్చి పాదయత్రలో తన వెంట నిలిచినందుకు కుమారుడు రాహుల్‌ ప్రేమతో తల్లి భుజంపై చేతులేసి కొద్ది దూరం నడవడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తించింది. ‘తల్లీకొడుకుల మధ్య ప్రేమ అంటే ఇలాగే కదా ఉండాలి’ అని వారికి అనిపించింది. ప్రజలంతా తన కుటుంబ సభ్యులే అనుకుని ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్లకు పైగా పరిపాలించారు దివంగత జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు. ఎక్కడ బహిరంగసభ పెట్టినా, ర్యాలీగా వెళ్లినా, రోడ్‌ షోలో కనిపించినా, ‘అమ్మా, అయ్యా, అక్కయ్యా చెల్లెమ్మ, తమ్ముడూ. అన్నయ్యా, తాతయ్యా అంటూ ప్రేమతో ప్రజలందరినీ వయసుతో నిమిత్తం లేకుండా పలకరించేవారు రాజన్న. అలాగే, తాను కన్నుమూసినా తెలుగు ప్రజలందరినీ తన కుమారుడికి కుటుంబ సభ్యులను చేశారు. ఇదే విధంగా, ‘యువనేత’ రాహుల్‌ జీ కూడా తన ప్రేమాభిమానాలను తన తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులకు పరిమితం చేయకుండా కోట్లాది మంది భారతీయులను తన కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకుంటే బావుంటుంది. వయసు ఐదు పదుల నిండిన తర్వాత అయినా ఘనత వహించిన కుటుంబ వారసుడు రాహుల్‌ జీ తన చుట్టూ నిరంతరం నిలబడి ఉండే పార్టీ కార్యకర్తలు సహా ప్రజలందరినీ తన మాతృమూర్తి, ప్రియతమ చెల్లెలను చూసుకుంటున్నట్టే వారి బాగోగులు పట్టించుకుంటే జాతి గర్విస్తుంది. అప్పుడే దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన ‘అధికార’ నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత అంటే ఆరు (సోనియా, ప్రియాంక, రాహుల్, రాబర్ట్‌ వాడ్రా, రేహాన్, మిరాయా) అని కాకుండా 140 కోట్లు అని ప్రజల నుంచి జవాబు వస్తుంది. ‘

ప్రజానాయకుడు ఎవరైనా, ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినా తనకు కుటుంబం అంటే కేవలం తన భార్యా పిల్లలు, తల్లిదండ్రులు అక్కచెల్లెళ్లు తదితరులు మాత్రమే కాదని, తన పరివారం సమస్త ప్రజానీకం అని భావిస్తేనే– జనం ఆ నాయకుడికి అధికారం, తమ బాగోగులు చూసే బాధ్యతలను అప్పగిస్తారు. బహుళ రాజకీయపక్షాల ఉనికి తప్పనిసరి అయిన పార్లమెంటరీ ప్రజాతంత్ర వ్యవస్థలో ఆయా పార్టీల నేతలకు ప్రజలే వారి కుటుంబసభ్యులు. ఈ రాజకీయ స్పృహ ఉన్న నేతలు ప్రజల సంక్షేమమే తమ మార్గంగా ముందుకు నడుస్తారు. అదే ప్రజాక్షేత్రంలో నిజమైన పాదయాత్ర’ అని తనదైన శైలిలో చురకలంటించారు ఎంపీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..