Hyderabad: 11 నుంచి భాగ్యనగరంలో శ్రీవారి వైభవోత్సవాలు.. దర్శనం, ముఖ్యమైన సేవల వివరాలివే
అక్టోబర్ 11 నుంచి 15 వరకు.. దివ్య దర్శనం, దైనిక ఆచారాలను సరిగ్గా తిరుమలలో జరిగే విధంగా.. నిర్వహించనుంది టీటీడీ. హైదరాబాద్ దోమల గూడ- ఇందిరాపార్కు రోడ్డులోని ఎన్టీఆర్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది.
నిత్యకళ్యాణం పచ్చ తోరణమైన తిరుమల శ్రీవారి దివ్య వైభవం చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఎంత చూసినా తనివి తీరనిది శ్రీవారి దివ్య దర్శనం. అలాంటి శ్రీనివాసుడి దివ్య వైభవం.. మన నగరానికి విచ్చేస్తే.. భక్త జనుల్లో ఆ ఆనందమే వేరు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం వారు.. హైదరాబాద్ నగర నడిబొడ్డున శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుమల వరకూ వెళ్లి దర్శనం చేసుకోడానికి వీలు కాని వారికి అందుబాటులోకి తెచ్చేలా టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అక్టోబర్ 11 నుంచి 15 వరకు.. దివ్య దర్శనం, దైనిక ఆచారాలను సరిగ్గా తిరుమలలో జరిగే విధంగా.. నిర్వహించనుంది టీటీడీ. హైదరాబాద్ దోమల గూడ- ఇందిరాపార్కు రోడ్డులోని ఎన్టీఆర్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ఈ ఆధ్యాత్మిక వైభవానికి అందరూ ఆహ్వానితులేనంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఇక శ్రీవారి కైంకర్యాలు, ఇతర ముఖ్యమైన సేవల విషయానికొస్తే..
- అక్టోబర్ 11న ఉదయం 8. 30 నుంచి 9. 30 గం. వరకు అష్టదళ పాద పద్మారాధన
- అక్టోబర్ 12న ఉదయం 8. 30 నుంచి 10 గం. వరకు సహస్ర కలశాభిషేకం
- అక్టోబర్ 13న ఉదయం 8. 30 నుంచి 9. 30 గం. వరకు తిరుప్పావడ సేవ
- అక్టోబర్ 14న ఉదయం 8. 30 నుంచి 10 గం. వరకు అభిషేకం
- అక్టోబర్ 15న ఉదయం పుష్పయాగం, అదే రోజు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకూ శ్రీనివాసకళ్యాణం ఉంటుంది.
ఈ విశేష సేవలను భక్తులందరూ కనులారా వీక్షించి.. స్వామివారిని మనసారా అర్పించి.. శ్రీవారి కృపకు పాత్రులు కావల్సిందిగా కోరుతోంది టీటీడీ. కాగా ఇదే నెలలో ఏపీలోని అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలులో, జనవరిలో ఢిల్లీలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..