YS Jagan-Sharmila: రాజకీయ బేదాభిప్రాయాలతో దూరంగా ఉంటున్న అన్నా-చెల్లెలు.. తండ్రి వర్ధంతి దగ్గర చేస్తుందా..?
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలైన ఈ ఇద్దరూ కొంతకాలం క్రితం వరకు కలిసే ఉన్నారు. అయితే రాజకీయాల్లో అభిప్రాయభేదాలు వచ్చిన తరువాత మాత్రం.. ఈ ఇద్దరూ బహిరంగంగా సందర్భాలు లేవు.
YS Jagan-Sharmila: ఒకరేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. మరోకరు పక్క రాష్ట్రంలో ప్రత్యేక పార్టీ స్థాపించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు అన్నా-చెల్లెల్లు. అయినప్పటికీ భిన్న లక్ష్యాలతో రాజకీయంగా రాణిస్తున్నారు. అయితే, గత కొంత కాలంగా రాజకీయంగా అభిప్రాయభేదాలు వచ్చిన తరువాత వ్యక్తిగతంగానూ కలవకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. వారే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలైన ఈ ఇద్దరూ కొంతకాలం క్రితం వరకు కలిసే ఉన్నారు. అయితే రాజకీయాల్లో అభిప్రాయభేదాలు వచ్చిన తరువాత మాత్రం.. ఈ ఇద్దరూ బహిరంగంగా సందర్భాలు లేవు. వైఎస్ఆర్ జయంతి రోజున కూడా ఎవరికి వారే వచ్చి, ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించి వెళ్లారు. దీంతో ఇవాళ వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా అయిన ఈ ఇద్దరూ కలుసుకుంటారా ? లేక మళ్లీ ఎవరికి వాళ్లే విడివిడిగా తమ తండ్రికి నివాళులు అర్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈసారి షర్మిల, తల్లి విజయమ్మ కలిసి నేడే ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఈ ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని సమాచారం. ఇక సీఎం జగన్ బుధవారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అక్కడే పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్న వైఎస్ జగన్.. ఆ వెంటనే విజయవాడకు తిరిగి వెళతారు. అయితే,తమ పిల్లలిద్దరిని కలపాలని తల్లి విజయమ్మ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తల్లి విజయమ్మ కోరిక మేరకే ఈ ఇద్దరూ ఒకరోజు ముందుగా ఇడుపులపాయకు వచ్చి కలిసేలా విజయమ్మ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్ జగన్, షర్మిల కొన్నాళ్ల నుంచి దూరం దూరంగా ఉంటున్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వచ్చినప్పటి నుంచే ఆమె తన అన్న జగన్‌కు దూరంగా ఉంటూ వచ్చారనే వార్తలు వచ్చాయి. షర్మిల తెలగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం సీఎం జగన్‌కు ఇష్టం లేదు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు సన్నిహితుల్లో ఒకరైన వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి బాహాటంగానే చెప్పారు. ఈ విషయంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని.. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
సజ్జల వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. వైఎస్ జగన్, షర్మిల కొన్నాళ్లుగా కలుసుకోకపోవడంతో వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందనే చర్చ జరుగుతోంది. వీరిద్దరి మళ్లీ ఒక చోటికి చేర్చేందుకు వారి తల్లి విజయమ్మ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ఆమె మరోసారి ఈ రకమైన ప్రయత్నం చేశారనే చర్చ జరుగుతోంది.