Covid 19 Third Wave: సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థర్డ్ వేవ్.. హెచ్చరించిన ఐసీఎంఆర్.. అదనపు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
కొద్దిరోజులుగా ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తూ గత వారం మళ్లీ పెరిగాయి. మరోసారి మహమ్మారి విరుచుకుపడే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికలు నిజమే అనిపిస్తున్నాయి.
Covid 19 Third Wave: కొద్దిరోజులుగా ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తూ గత వారం మళ్లీ పెరిగాయి. మరోసారి మహమ్మారి విరుచుకుపడే అవకాశముందన్న నిపుణుల హెచ్చరికలు నిజమే అనిపిస్తున్నాయి. థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తెలిపింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో థర్డ్ వేవ్ రావచ్చని ICMR ఎక్స్‌పర్ట్, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సమిరన్ తెలిపారు. అక్టోబర్‌లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కి చేరుతుంది అన్నారు. సెకండ్ వేవ్ పెద్దగా రాని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఆ రకంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ అంతగా ప్రభావం చూపలేదు. అయితే, ఏపీ, తెలంగాణలో ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించింది. నిన్నటితో ముగిసిపోయే గడువును సెప్టెంబర్ 15 వరకూ పెంచింది. 5 నుంచి ఆదివారాల్లో బీచ్‌లకు సందర్శకుల్ని నిషేధించారు. అలాగే… శుక్ర, శని, ఆదివారం ప్రార్థనాలయాలను మూసివేసే కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. కేరళతో సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అటు కేరళ నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు తప్పనిసరిగా చేస్తున్నారు.
కరోనా మూడోవేవ్ రావచ్చనే హెచ్చరికల నేపథ్యంలో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్నిఏర్పాట్లు చేసిన సర్కారు.. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ముందుగానే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి ఆమోదం తెలుపుతూ కేంద్రం ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్లాన్‌ఫేజ్ 2 కింద రాష్ట్రానికి నిధులు కేటాయించింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెరి సగం ఖర్చుతో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతోంది. రూ.456 కోట్లతో కొవిడ్ అత్యవసర మందులు, ఐసీయూ పడకలు, నిర్ధారణ పరీక్షల కేంద్రాలు, చిన్న పిల్లలకు ఐసీయూలు, అదనపు పడకలు ఇతర సదుపాయాలు కల్పించనున్నారు.
అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో 850 ఐసీయూ బెడ్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో నిమ్స్‌కు కొత్తగా 200 ఐసీయూ బెడ్లు కేటాయించారు. టిమ్స్, గాంధీ, మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రులకు 100 చొప్పున, ఉస్మానియాకు 75 బెడ్లను మంజూరుచేశారు. ఆదిలాబాద్ రిమ్స్‌తోపాటు సిద్దిపేట, నిజామాబాద్, సూర్యాపేట, నల్లగొండ జనరల్ దవాఖానల్లో 50 చొప్పున ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కోబెడ్‌కు రూ.16.85 లక్షల చొప్పున ఖర్చుచేసేలా ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. అన్నిచోట్ల 20 శాతం ఐసీయూ బెడ్లను పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 16జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఏర్పాటుచేయగా, మిగిలిన 17 జిల్లాల్లోనే ఏర్పాటుచేయబోతున్నారు.