Pension Rules: ఏ నెల పింఛను ఆ నెలలోనే..! తీసుకోకపోతే ఆ నెల డబ్బులు మురిగిపోయినట్లే.. సర్కారు కొత్త రూల్
ఆంధ్రప్రదేశ్‌లో నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఇక మీదట ఉండవు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త నిబంధన
AP government – Old Age Pensions: ఆంధ్రప్రదేశ్‌లో నెలవారీ వృద్ధాప్య పింఛను బకాయిల చెల్లింపులు ఇక మీదట ఉండవు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. నేడు జరిగే పింఛను పంపిణీ నుంచే ఈ విధానం అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ అక్రమంగా పింఛను పొందేవారికి చెక్ పెట్టేందుకే..ఈ మేరకు మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉంటూ మూడు, నాలుగు నెలలకోసారి సొంతూళ్లకు వచ్చి అక్రమంగా పింఛన్లు తీసుకునే వారికి చెక్ పెట్టేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇందులో భాగంగా, లబ్ధిదారులు ఏ నెల పింఛను ఏ నెలకు.. ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను ప్రవేశపెట్టి ఒకేసారి పాత నెలల పింఛనును తీసుకునే విధానానికి స్వస్తి చెప్పింది. ఒకవేళ లబ్దిదారు గడచిన నెలల పింఛను తీసుకోని పక్షంలో ఆ మొత్తం మురిగిపోయినట్లే లెక్క. బకాయిలు ఇక మీదట చెల్లించరు. బుధవారం నుంచే ఈ కొత్త నిబంధనను అమలుచేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వెల్లడించారు.
అంతేకాదు, మరో అడుగు ముందుకేసి జూలై, ఆగస్టు నెలల్లో పింఛను డబ్బులు తీసుకోని వారికి ఈ నెలలో ఎటువంటి బకాయిలు మంజూరు చేయకుండా కేవలం సెప్టెంబర్ నెలకు చెల్లించాల్సిన పింఛను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, ఏపీ రాష్ట్రంలో నెలనెలా దాదాపు 60 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తోంది. అయితే, అందులో రెండు లక్షల మందికి పైగా నెలనెలా పింఛన్లు తీసుకోవడంలేదు. ఇలా ఏప్రిల్‌లో 2.04 లక్షల మంది, మేలో 2.57 లక్షల మంది.. జూన్‌లో 2.70 లక్షల మంది.. జూలైలో 2.14 లక్షల మంది.. ఆగస్టులో 2.40 లక్షల మంది తీసుకోలేదని అధికారులు గుర్తించారు.
ఇలా పింఛను తీసుకోని వారంతా పొరుగు రాష్ట్రాల్లో శాశ్వతంగా ఉండే వారే ఎక్కువమంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి వారికి ఇప్పటిదాకా మూడు నెలల బకాయిలు కలిపి రూ.6,750లు, లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఒకేసారి ఇస్తుండడంతో వారు రెండు మూడు నెలలకోసారి ఊళ్లకు వచ్చి ఆ మొత్తాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు పసిగట్టినట్టు చెప్పుకొస్తున్నారు.