YS Jagan: మళ్లీ ఆర్థిక వివాదాల్లో వైసీపీ అధినేత.. అసత్యాలు ప్రచారం చేస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాః జగన్

ప్రస్తుతం కార్యకర్తలపైన నేతలపైన వరుసగా కేసులు నమోదవుతున్న తరుణంలో తాజాగా జగన్‌పైన సైతం కేసులు నమోదైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతుంది.

YS Jagan: మళ్లీ ఆర్థిక వివాదాల్లో వైసీపీ అధినేత.. అసత్యాలు ప్రచారం చేస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాః జగన్
Ys Jagan
Follow us
S Haseena

| Edited By: Balaraju Goud

Updated on: Nov 30, 2024 | 10:44 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ మళ్ళీ వివాదాలు అలుముకుంటున్నాయి. గతంలో అధికారంలో ఉండగా సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు చేసుకున్న ఒప్పందాలపై వస్తున్న విమర్శలు వైఎస్ జగన్ చుట్టూ ముసురుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసులో నమోదైన కేసులు రాజకీయంగా తీవ్ర వివాదాలకు కారణం కాగా, అధికారాన్ని చేపట్టిన తర్వాత అదానీతో చేసుకున్న ఒప్పందాలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్లకు ఆశపడి చేసుకున్నారంటూ వైసీపీ అధినేత పై విమర్శల అధికార పార్టీ దాడి చేస్తుంది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ వివాదాల ముసురుకుంటూ ఉండటం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ కేసులు కోసం కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా అధికారంలోకి వచ్చాక అదానీతో వివిధ పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై భేటీ కావడం, సోలార్ విద్యుత్ కొనుగోళ్ల కోసం చేసుకున్న ఒప్పందాలు లాంటి అంశాలపై తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయినప్పుడు జగన్ చుట్టూ ముసురుకుంటున్న వివాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్టీ శ్రేణులు.

ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న వివాదాలపై తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ జగన్. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అంశంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది తప్ప, అదానీ సంస్థతో లేదా ప్రైవేట్ సంస్థతో కాదని వైసీసీ అధినేత తేల్చి చెబుతున్నారు. ఇదే అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేస్తుందని సెకితో మాత్రమేనని ప్రైవేట్ సంస్థతో కాదని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకితో రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందన్నారు. థర్డ్ పార్టీతో ఎక్కడ ఒప్పందం చేసుకోలేదన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇక్కడ దళారులు ఎవరున్నారు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

అవినీతికి అవకాశం లేకుండా తాము ఒప్పందం చేసుకున్నామని, అయినప్పటికీ తనపై తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎక్కువ రేట్లకు విద్యుత్ కొనుగోలుకు గత ప్రభుత్వం ఒప్పందాలు చేసిందని, తాము ఎక్కడ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా చూశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. తాము కొనుగోలు చేశామని, కానీ ఇప్పుడు విమర్శలు చేస్తున్న వాళ్లంతా అదే ప్రైవేట్ సంస్థతో తమ ఒప్పందాలు చేసుకున్నారని జగన్ గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థను కాదని ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు పరిస్థితి ఇలా వచ్చిందని జగన్ మండిపడ్డారు.

విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలను పక్కనపెట్టి అసత్యాలు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడుతున్నారని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరైతే తనపై విమర్శలు చేస్తున్నారో వారు తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయకపోతే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన ఆరోపణలు చేస్తున్న వారిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

ఒకవైపు సోషల్ మీడియా కేసులు పార్టీ నేతలను కార్యకర్తలను ఆందోళనలోకి గురిచేస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను సైతం రాష్ట్రంలో కేసులు వెంటాడుతున్నాయి. ఒక్కొక్కరిపై ఇప్పటివరకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న వేళ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎఫ్‌బీఐ కేసు నమోదు చేస్తుందనే ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు మరింత ఆందోళనకి గురిచేస్తుంది. అయితే అదానీ ముడుపులు ఇచ్చారనే దానిపై ప్రచారం జోరుగా జరుగుతుండటంతో, ప్రస్తుతం ఆ పార్టీ నేతలను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తప్పయితే రద్దు చేయొచ్చు కదా..! అయినా ఆ ఒప్పందాలను రద్దు చేయకుండా అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కార్యకర్తలపైన నేతలపైన వరుసగా కేసులు నమోదవుతున్న తరుణంలో తాజాగా జగన్‌పైన సైతం కేసులు నమోదైతే పరిస్థితి ఏంటన్న ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతుంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న విమర్శలు విషయంలో ఏ రకంగా వైసీపీ ముందుకు వెళ్తుందో..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..