Visakhapatnam: ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!

ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్.

Visakhapatnam: ప్రయాణీకులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా అలజడి.. కళ్ళ మంటలతో కుప్పకూలిన మహిళలు!
Rtc Bus
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Balaraju Goud

Updated on: Nov 30, 2024 | 9:12 AM

విశాఖ ఐటిఐ జంక్షన్ ప్రాంతం.. వాహనాలతో మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది.. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు నుంచి ఎన్ఏడి జంక్షన్ వైపు ఆర్టీసీ బస్సు ఒకటి ప్రయాణిస్తుంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా అలజడి. ముగ్గురు మహిళలు కేకలు పెట్టారు. కళ్ళ మంటలతో ఒకసారిగా ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చూస్తే పరిసర ప్రాంతాల్లో ఏదో ద్రావణం పడినట్టు కనిపించింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విశాఖపట్నంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది.

శుక్రవారం(నవంబర్ 30) రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కళ్ళ మంటలతో ముగ్గురు మహిళల కేకలు పెట్టడంతో.. బస్సును డ్రైవర్ ఆపారు. ప్రయాణికులను హుటాహుటీన హాస్పిటల్‌కు తరలించారు. మిగిలిన ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఆ ద్రావణం ఎక్కడి నుంచి పడిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వెళ్లే పరిసర ప్రాంతాల్లో ఫోర్ వీలర్ లే ప్రయాణించినట్టు గుర్తించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గిడిజాలకు వెళ్తుంది రూట్ నెంబర్ 28 బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ముగ్గురు బాధిత మహిళలు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ప్రయాణికులపై పడిన ద్రావణాన్ని శాంపిల్స్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్. ఆ ద్రావణం ఏంటని విషయం ఇంకా నిర్ధారించాల్సి ఉందని, వాటిని ల్యాబ్‌కు పంపుతామని అంటున్నారు పోలీసులు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..