AP News: అగరబత్తీల వ్యాపారానికి కోట్లలో లాభాలు.. అసలు రహస్యం ఏంటో తెల్సా
గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని గంజాయి అక్రమ రవాణా వ్యవహారం పోలీసులకే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి విజయనగరంలో కోట్ల రూపాయల కాస్ట్లీ విల్లాను అద్దెకు తీసుకుని..
గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని గంజాయి అక్రమ రవాణా వ్యవహారం పోలీసులకే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి విజయనగరంలో కోట్ల రూపాయల కాస్ట్లీ విల్లాను అద్దెకు తీసుకుని.. ఏడాదిన్నర కాలంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కటకటాలపాలు చేశారు విజయనగరం పోలీసులు. ధర్మపురిలో ప్రముఖులు నివాసం ఉండే వసంత విహార్‌లో ఒక విల్లాను అద్దెకు తీసుకొని అక్కడే గంజాయి అక్రమ రవాణా కేంద్రంగా కుటీర పరిశ్రమను ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠా. విజయనగరం సమీపంలో ఉన్న అరకు ప్రాంతం నుంచి ఎంతో చాకచక్యంగా తాము నివాసముంటున్న విల్లాకు గంజాయిని తరలించి అక్కడి నుంచి చిన్న చిన్న ప్యాకెట్స్‌గా మార్చి బీహార్, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ వ్యాపారం నడుపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ వసీం గత ఏడాదిన్నర క్రితం విజయనగరం పట్టణానికి వచ్చాడు. అలా జిల్లాకు వచ్చిన వసీం వసంత విహార్‌లో డూప్లెక్స్ విల్లాను అద్దెకు తీసుకున్నాడు. వసంత విహార్.. జిల్లాలోని ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతం కావడంతో ఎవరికి అనుమానం రాలేదు. అలా పకడ్బందీ ప్రణాళికతో విల్లాలో దిగిన వసీం తన గంజాయి అక్రమ రవాణాను ప్రారంభించాడు. విజయనగరం జిల్లా సమీపంలో ఉండే అరకులో గంజాయి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అక్కడ మజ్జి విశ్వనాథం, అతని భార్య మజ్జి గంగమ్మల సహాయంతో గంజాయి కొనుగోలు చేసేవాడు. వారికి కావాల్సినంత డబ్బు ఇచ్చేవాడు. ఇతరుల కన్నా ఎక్కువ ధర వస్తుండటంతో మజ్జి విశ్వనాథం దంపతులు వసీంకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో గంజాయి ఏర్పాటు చేసేవారు. అలా అరకులో మజ్జి దంపతుల వద్ద కొనుగోలు చేసిన గంజాయిని విజయనగరం తరలించేందుకు గొల్లూరు అనీల్, గోవింద, గోపీ, అర్జున్ అనే నలుగురు వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకున్నాడు. ఈ నలుగురు వివిధ మార్గాల ద్వారా పోలీసుల కన్నుగప్పి వసీం నివాసం ఉంటున్న విల్లాకు తరలించేవారు.
అనంతరం పెద్దఎత్తున తన నివాసంకి చేరుకున్న గంజాయికి వాసన బయటకు రాకుండా అగరబత్తీలు, సువాసన వెదజల్లే పెర్ఫ్యూమ్‌లను కలిపేవాడు. అలా సరుకు సిద్ధం చేసి దేశవ్యాప్త నెట్‌వర్క్ ఉన్న పెడ్లర్ మహ్మద్ కబీర్‌కి సమాచారం ఇచ్చేవాడు. అక్కడ నుండి కబీర్ తన మనుషులను పంపి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఢిల్లీకి అక్రమ రవాణా చేసేవారు. అందులో భాగంగా ఢీల్లీలో నివాసం ఉంటున్న పెడ్లర్ మహ్మద్ కబీర్ బీహార్‌కు చెందిన ఇంపోజ్ అలాం, డిల్లీ జామ్ నగర్‌కు చెందిన రుక్వాయ్ ఖుర్జీట్లును గంజాయి కోసం విజయనగరంలోని వసీం వద్దకు పంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో వసీం నివాసంపై దాడులు చేసి వసీంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న ఇరవై రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు పోలీసులు.