విజయ దశమి నాటికి విశాఖ పరిపాలన రాజధానిగా మారడం సాధ్యమేనా? ఏర్పాట్లు చేయడం తమకు కష్టం కాదంటున్న యంత్రాంగం..
Visakhapatnam: నిన్నటిదాకా హలో వైజాగ్.. ఇప్పుడైతే ఛలో వైజాగ్. దసరా తర్వాత మన అడ్డా విశాఖేనంటూ నిన్న క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రుల దగ్గర ఓపెన్‌గా చెప్పేశారు సీఎం జగన్. సమయం లేదు మిత్రమా.. మిగిలింది నెలరోజులే అంటూ ఉరుకులు పెడుతున్నారు అధికారులు. మరి.. ఈ చిన్న గ్యాప్‌లోనే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా వైజాగ్ రెడీ అయ్యే ఛాన్సుందా..?
విశాఖపట్నం, సెప్టెంబర్ 21: పరిపాలన రాజధానిగా పూర్తిగా షిఫ్ట్ అవుతుందా కాదా అనేది అటుంచితే.. ముఖ్యమంత్రి నివాసాన్ని మాత్రం విశాఖకు మార్చే ప్రక్రియ వేగవంతమైంది. సీఎం మకాం మారితే.. దాంతో పాటే క్రమంగా అధికార యంత్రాంగం అంతా విశాఖ నుంచే పని చేస్తుందన్నది ప్రభుత్వం వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. నిజానికి అక్టోబర్ 23న విజయ దశమి నాటికి విశాఖకు రావాలన్నది ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆలోచన. అంటే అందుకు సరిగ్గా నెల రోజులే సమయం మిగిలి ఉంది. బుధవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఇదే విషయాన్ని తేల్చి చెప్పేశారు సీఎం.
అయితే.. ఆలోగా విశాఖలో పరిపాలన రాజధాని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేసే పరిస్థితైతే కనిపించలేదు. ఈ క్రమంలో రిషికొండపై గతంలో ఉన్న హరిత హోటల్‌ని తొలగించి టూరిజం శాఖ నిర్మిస్తున్న తాజా నిర్మాణాల్లోనే సీఎం బస చేస్తారని తెలుస్తోంది. దీన్ని కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు తమ నిర్మాణాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఇవ్వడానికి ఏమీ అభ్యంతరం లేదని టూరిజం శాఖ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అటు ప్రతి పక్షాలైతే ఆగమేఘాల మీద విశాఖకు మకాం మార్చడమేంటి అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. రాజధాని వ్యవహారం కోర్టులో ఉంటే ముఖ్యమంత్రి ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం ‘ఛలో వైజాగ్’ పేరుతో జమ్మిక్కులు చేస్తున్నారంటోంది టీడీపీ.
మరోవైపు వామపక్షాలు కూడా జగన్ సర్కార్‌పై విరుచుకు పడుతున్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే వాటిని పక్కకు నెట్టి.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ మంత్రం జపిస్తున్నారన్నది కామ్రేడ్ల ఆరోపణ. అధికారుల నుంచి వస్తున్న వివరణ చూస్తే మరింత ఆసక్తికరంగా ఉంది. ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నారన్న సమాచారం అధికారికంగా రానేలేదట. పత్రికల్లో కథనాలే తప్ప మరో హడావిడి లేనే లేదట. సీఎం క్యాంప్ ఆఫీసుకు ఏర్పాట్లు చేయడం కష్టమేమీ కాదని అధికారులు అంటున్నారు. ఇక ఇప్పటికిప్పుడు HODలు, కార్యదర్శులు రారు కాబట్టి హైరానా లేదంటోంది స్థానిక యంత్రాంగం.
ఇంకా సీఎం విశాఖకు వస్తే అతిథులకు అవసరమైన స్టార్ హోటల్స్‌లో 4 వేల రూమ్స్ ఉన్నాయని, , ఒక వేళ అవసరమైతే ఆ హోటల్స్‌లో మౌలిక సదుపాయాలు పెంచేలా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. పైగా.. ఎన్నికలకు సంవత్సర కాలమే మిగిలి ఉంది కనుక ముఖ్యమంత్రి ఈ ఏడాది మొత్తం విశాఖలోనే ఉండిపోరన్న క్లారిటీ ఒకటుంది. అమరావతికి షటిల్ కొడుతూ ఉంటారు.. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తారనేది మరో ఊరట. మొత్తం మీద విశాఖ పూర్తిస్థాయి పరిపాలనా రాజధానిగా మారాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు.. అనేది అధికారుల ధీమా.