Yoga Andhra: బెజవాడలో ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్.. కృష్ణా తరంగాలపై ప్రపంచ రికార్డుకు సర్వం సిద్ధం!
భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతిఒక్కరికీ చేరువచేయాలనే లక్ష్యంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర-2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వద్ద కృష్ణమ్మ ఒడిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్- ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు అధికారులు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ సన్నాహాల్లో భాగంగానే ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వద్ద కృష్ణమ్మ ఒడిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్- ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు అధికారులు. యోగాను ప్రతిఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు పడవలపై యోగా మెగా ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఈవెంట్‌లో భాగంగా పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్‌పై వెయ్యిమందితో కామన్ యోగా ప్రోటోకాల్‌తో యోగాసనాలు వేయనున్నారు. దీని ద్వారా ప్రపంచ రికార్డు సాధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భానుడి లేలేత కిరణాలు పరచుకొన్న వేళ ప్రకృతి రమణీయత మధ్య కనువిందుగా జరిగే ఈ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ మెగా ఈవెంట్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగంతో ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్యం, మునిసిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య తదితర శాఖలతో పాటు అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ), స్విమ్మర్ల అసోసియేషన్, యోగా శిక్షణ సంస్థలు వంటివి కూడా భాగస్వామ్యం అయ్యాయి.
పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు…
యోగా విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో ఇలాంటి మెగా ఈవెంట్ల విషయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఈ వెంట్ జరిగే ప్రాంతంలో గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, సుశిక్షితులైన బోట్ ఆపరేటర్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. బోట్లను పరిశీలించి వాటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు కోట్ల మందికి యోగాను నేర్పించే లక్ష్యంతో యోగాంధ్ర-2025ను ఇప్పటికే ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు.
ఎన్‌టీఆర్ జిల్లాలో నిత్య యోగా ద్వారా ప్రతి గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పది లక్షల మందికి యోగాను నేర్పించేందుకు అయిదువేల మంది సర్టిఫైడ్ ట్రైనర్లతో కృషి చెయ్యనున్నారు. దీంట్లో ఇప్పటికే ఏడు లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గాంధీ హిల్, పవిత్ర సంగమం, హరిత బెరం పార్కులో నిర్వహించగా, త్వరలో కొండపల్లి ఖిల్లాపైనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..