Visakhapatnam: న్యూ ఇయర్ వేడుకల వేళ విశాఖలో అమలుకానున్న ఆంక్షలివే..
విశాఖపట్నంలో కొత్త సంవత్సరం వేడుకలపై సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి నుంచే బీచ్‌లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈమేరకు ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.
విశాఖపట్నంలో కొత్త సంవత్సరం వేడుకలపై సిటీ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి నుంచే బీచ్‌లో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఈమేరకు ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ఆర్కే , జోడుగుళ్లపాలెం, సాగరనగర్ , రుషికొండ , భీమిలి, యారాడ బీచ్ లకు సందర్శకులు, వాహనాల రాకపోకల నియంత్రణ విధించనున్నట్లు అందులో పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నేవల్ కోస్ట్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్లో అన్ని రకాల వాహనాల రాకపోకల నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. అదేవిధంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీఆర్‌టీఎస్ రోడ్ హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్, పెందుర్తి జంక్షన్ నుంచి NAD జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మధ్య రహదారులను క్లోజ్ చేయనున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ పై కఠిన చర్యలు..
ఆంక్షల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామా టాకీస్ వరకు ఉన్న బీఆర్‌టీఎస్ రోడ్ మధ్య లైను, RTC కాంప్లెక్స్ వద్ద ఉన్న అండర్ పాస్‌ను కూడా మూసివేయనున్నారు. కాగా తాగి వాహనాలు నడిపే వారిపై, స్పీడ్ డ్రైవింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ఏడీసీపీ ఆదినారాయణ హెచ్చరించారు. నగర రోడ్ల పై పోలీసులు ప్రత్యేక పహారా ఉంటుందని బైక్ రేసర్ లపై కూడా నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు. రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్, షాప్ లు ప్రభుత్వ నిభందనల మేరకు వారికి కేటాయించిన సమయం వరకే తెరవాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక బాధ్యతగా బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులు పై వేడుకలకు పర్మిషన్ లేదన్నారు. విశాఖ నగర వాసులు కోవిడ్ నిబంధనలు పాటించి, నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఏడీసీపీ కోరారు.