AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రగులుతున్న బెజవాడ.. ‘పాదయాత్ర కాదది.. ఈవెనింగ్ వాక్’.. లోకేశ్ యువగళంపై వైసీపీ సెటైర్స్..

ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కంచుకోట. అలాంటి కంచుకోటను 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టింది వైసీపీ. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీ ఏకంగా 14 సీట్లు గెలుచుకుంది. జిల్లా మొత్తంలో ప్రత్యర్థి టీడీపీకి రెండే రెండు సీట్లు మిగిల్చింది. 2024లో జరిగే ఎన్నికలకు కూడా పక్కా ప్లాన్‌తో వెళ్తోంది వైసీపీ. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నా సరే.. బెజవాడపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. మరే నియోజకవర్గంలోనూ అభ్యర్ధులను ప్రకటించింది లేదు. కానీ, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ఫిక్స్ చేశారు. విజయవాడ తూర్పు దేవినేని అవినాశ్‌కు..

Andhra Pradesh: రగులుతున్న బెజవాడ.. ‘పాదయాత్ర కాదది.. ఈవెనింగ్ వాక్’.. లోకేశ్ యువగళంపై వైసీపీ సెటైర్స్..
YCP vs TDP
Shiva Prajapati
|

Updated on: Aug 19, 2023 | 8:29 PM

Share

నారా లోకేశ్ పాదయాత్ర బెజవాడలో అడుగుపెట్టిన సందర్భంగా టీడీపీ, వైసీపీ మధ్య హైఓల్టేజ్ వార్ నడుస్తోంది. లోకేశ్‌ పాదయాత్ర జరగకుండా పెద్ద స్కెచ్చే వేస్తున్నారని టీడీపీ అంటుంటే.. వైసీపీ మాత్రం చాలా కూల్‌గా లోకేశ్‌ రావాలి, సీఎం జగన్‌ చేసిన అభివృద్ధి చూసి సెల్ఫీలు దిగాలి అంటోంది. బెజవాడలో యువగళం ఎంట్రీ, కౌంటర్‌గా వైసీపీ వ్యూహం. ఇది చెప్పడానికి సింపుల్‌గానే ఉన్నా గ్రౌండ్‌ వర్క్‌ మాత్రం వేరే లెవెల్‌లో జరిగింది. అది ఈ మధ్యకాలంలో బెజవాడ పాలిటిక్స్‌లో జరగనిది, చూడనిది.

దేవినేని అవినాశ్‌ ఇంటికి సీఎం జగన్..

ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కంచుకోట. అలాంటి కంచుకోటను 2019 ఎన్నికల్లో బద్దలు కొట్టింది వైసీపీ. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే వైసీపీ ఏకంగా 14 సీట్లు గెలుచుకుంది. జిల్లా మొత్తంలో ప్రత్యర్థి టీడీపీకి రెండే రెండు సీట్లు మిగిల్చింది. 2024లో జరిగే ఎన్నికలకు కూడా పక్కా ప్లాన్‌తో వెళ్తోంది వైసీపీ. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నా సరే.. బెజవాడపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. మరే నియోజకవర్గంలోనూ అభ్యర్ధులను ప్రకటించింది లేదు. కానీ, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను ఫిక్స్ చేశారు. విజయవాడ తూర్పు దేవినేని అవినాశ్‌కు, విజయవాడ వెస్ట్‌ వెల్లంపల్లి శ్రీనివాస్‌కు, విజయవాడ సెంట్రల్‌ మల్లాది విష్ణుకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. రీసెంట్‌గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో స్వయంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బెజవాడలో ఈ లెవెల్ పొలిటికల్‌ యాక్టివిటీ ఈ మధ్యకాలంలో కనిపించింది లేదు. ఇదే హైలెట్‌ అనుకుంటే.. సీఎం జగన్‌ దేవినేని అవినాశ్‌ ఇంటికి వెళ్లడం మరో బిగ్ సర్‌ప్రైజ్. ఓ స్టార్ హోటల్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన ముఖ్యమంత్రి.. దేవినేని అవినాశ్‌ కోరడంతో పక్కనే ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు. ఇది మామూలుగా, యాధృచ్చికంగా జరిగిన పరిణామం కానే కాదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. విజయవాడ ఈస్ట్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న అవినాశ్‌ను.. సీఎం జగన్‌ ఇంటికి వెళ్లి కలవడం వెనక పెద్ద ప్లానే ఉందంటున్నారు.

బెజవాడలో రాజకీయ సెగ..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. బెజవాడలో రాజకీయ సెగ పుట్టిస్తోంది. నారా లోకేశ్‌ బెజవాడలో అడుగుపెట్టకముందే రాజకీయ ప్రకంపనలు రేగాయి. లోకేశ్ ఎంట్రీకి ముందే విజయవాడలోని మూడు నియోజకవర్గాలను ఫిక్స్ చేసింది వైసీపీ. యువగళం సక్సెస్‌ కాకూడదన్న గట్టి పట్టుదలతో, పక్కా ప్లాన్‌తో వైసీపీ వెళ్తున్నట్టు కనిపిస్తోంది వైసీపీ. ఫ్లెక్సీల నుంచి నేతల మాటల దాడి వరకు అన్నీ హైఓల్టేజ్‌తో సాగుతున్నాయి. అందుకే, బెజవాడ రాజకీయం భగభగమంటోంది.

రాయలసీమ నుంచి ప్రకాశం, పల్నాడు, గుంటూరు మీదుగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది లోకేశ్ పాదయాత్ర. సీఎం జగన్ ఉండే తాడేపల్లిలో యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో అక్కడే శిలాఫలకం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా నేతలు వీడ్కోలు పలకగా.. కృష్ణా జిల్లా నేతలు గట్టి స్వాగతం పలికారు. ప్రకాశం బ్యారేజ్‌పై లోకేశ్‌కు గ్రాండ్ వెల్‌కం చెప్పారు. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో భారీ ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. విజయవాడలో లోకేశ్ పాదయాత్రను గ్రాండ్ సక్సెస్‌ చేసే బాధ్యతను ప్రత్యేకంగా కేశినేని చిన్నికి అప్పగించారు చంద్రబాబు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర దాదాపుగా ఆరు రోజుల పాటు జరుగుతుంది. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలను కవర్ చేయనున్న లోకేశ్.. విజయవాడ సిటీలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. 22వ తేదీన గన్నవరంలో భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఈ సభకు లక్ష మందిని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది టీడీపీ. గన్నవరం నియోజకవర్గంలో మండలానికో మాజీ ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.

అంతా సాఫీగా సాగితే అందులో మజా ఏముంటుంది. అందుకే, యువగళానికి వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోందంటూ మండిపడింది టీడీపీ. లోకేశ్ పాదయాత్రలో అలజడికి వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. దేవినేని అవినాశ్ కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించడం వెనుక కుట్ర ఉందని, గన్నవరం సభలో అల్లర్లు సృష్టించడానికే అవినాష్ ఇంటికి సీఎం వెళ్లారని అన్నారు.

యువగళం పాదయాత్ర సక్సెస్‌ చేయడానికి కేశినేని చిన్ని రంగంలోకి దిగారు. తూర్పు నియోజకవర్గంలో లోకేశ్‌ సభకు స్థలాలు గానీ, ఫంక్షన్ హాల్స్ గానీ ఇవ్వకుండా వైసీపీ బెదిరిస్తోందనేది టీడీపీ ఆరోపణ. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా సరే.. తూర్పు నియోజకవర్గంలో లోకేశ్ బహిరంగసభ జరిగి తీరుతుందని తేల్చిచెప్పారు కేశినేని చిన్ని. ఏం జరిగినా సరే చూసుకుందాం అని చిన్ని హామీ ఇవ్వడంతో బెజవాడ తూర్పు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అయితే, నారా లోకేశ్ పాదయాత్రలో ఎంపీ కేశినేని నాని హడావుడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ పాదయాత్రలో పాల్గొనకపోయినా, చివర్లో నామ్‌ కే వాస్తే కనిపించినా… అది పార్టీపై అసంతృప్తిగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

దేవినేని అవినాష్ కౌంటర్..

టీడీపీ నేతల కామెంట్లు, ఊహాగానాలపై దేవినేని అవినాశ్ తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. యువగళం పాదయాత్ర కాదు.. అదొక ఈవెనింగ్‌ వాక్‌ అంటూ కామెంట్ చేశారు. లోకేశ్ పాదయాత్రకు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంకి పెద్దగా డిఫరెన్స్‌ కనిపించడం లేదన్నారు అవినాశ్. నారా లోకేశ్ బెజవాడ నగరం మొత్తం నడవాలని కోరుకుంటున్నట్టు పంచ్‌ ఇచ్చారు. రిటైనింగ్‌ వాల్, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్‌ ఫ్లైఓవర్ వద్ద లోకేశ్ సెల్ఫీలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని ఎద్దేవా చేశారు. బెజవాడలో సీఎం జగన్ చేసిన అభివృద్ధిని చూడడానికైనా నారా లోకేశ్ రావాలని కోరుకుంటున్నానని తన స్టైల్‌లో మాట్లాడారు. ఇక దమ్ముంటే లోకేశ్‌ విజయవాడ వెస్ట్‌ నుంచి గెలవాలని, గెలిస్తే గనక రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు వెల్లంపల్లి శ్రీనివాస్. అటు మల్లాది విష్ణు కూడా టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేసినందున అమ్మవారికి లోకేశ్‌తో క్షమాపణ చెప్పించి విజయవాడలో అడుగుపెట్టాలన్నారు మల్లాది.

విజయవాడలో యువగళం పాదయాత్రతో పాటు గన్నవరం రాజకీయాలు కూడా రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం టికెట్‌ తనకు కాకుండా వల్లభనేని వంశీకి ఇచ్చే అవకాశాలు ఉండడంతో.. టీడీపీలో చేరుతున్నట్టు అనౌన్స్‌ చేశారు. ఈ నెల 22న గన్నవరంలో లోకేశ్‌ బహిరంగ సభ జరిగే రోజునే యార్లగడ్డ పసుపు కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

మొత్తానికి బెజవాడ రాజకీయంగా భగభగమంటోంది. నారా లోకేశ్ ఎంట్రీ, దేవినేని అవినాశ్ కౌంటర్, మల్లాది, వెల్లంపల్లి సవాళ్ల మధ్య.. ఈ ఆరు రోజుల పాటు బెజవాడలో రాజకీయం హాట్‌హాట్‌గానే సాగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..