Andhra Pradesh: ప్రభుత్వ ఖజానాకే కన్నం.. తోటి ఉద్యోగుల జీతాల పేరుతో కోట్లు కొట్టేసిన ఘనుడు..
నంద్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బరితెగించాడు. అడ్డదారిలో కోట్లు సంపాదించాలనుకున్నాడు.. తోటి ఉద్యోగుల జీతాలకే కన్నేశాడు. నకిలీ బిల్లులతో కోటి రూపాయల ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసిన అహోబిలం PHC సీనియర్ అసిస్టెంట్ బండారం ఆడిట్‌లో బయటపడింది. ఆళ్లగడ్డ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

అక్రమాలకు, అవినీతికి, మోసాలకు కాదేదీ అనర్హం అని నిరూపించాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. తోటి ఉద్యోగుల కడుపు కొట్టి, నకిలీ బిల్లులతో ఏకంగా కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ ధనాన్ని తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అహోబిలం PHCలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇంతియాజ్ అలీఖాన్, గత కొంతకాలంగా ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నాడు. ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బందికి అందాల్సిన జీతాల బిల్లులపై కన్నేశాడు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ, ఫేక్ బిల్లులను సృష్టించి ట్రెజరీ నుంచి సొమ్మును డ్రా చేసేవాడు. ఈ విధంగా కాజేసిన సొమ్మును తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాతో పాటు తన సోదరి ఖాతాకు కూడా మళ్లించాడు. ఇలా సుమారు కోటి రూపాయలకు పైగా సొమ్మును స్వాహా చేసినట్లు విచారణలో తేలింది.
ఆడిట్‌లో బయటపడ్డ బండారం
ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ ఆడిట్‌లో లెక్కల్లో భారీ తేడాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతుగా విచారణ జరపగా, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ చేసిన మోసం బయటపడింది. జిల్లా ట్రెజరీ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు ఇంతియాజ్ అలీఖాన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ కుంభకోణంలో మరికొందరు అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
