AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

ప్రపంచం చూపు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న యుద్ధంపై ఉంది. కానీ ఒక చైనా విద్యావేత్త చేసిన అంచనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దుబాయ్ ఒక ఎండమావి.. అది త్వరలోనే కనుమరుగవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఆ షాకింగ్ నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..
China Nostradamus Xueqin Jiang On Us Iran War
Krishna S
|

Updated on: Mar 10, 2026 | 10:09 PM

Share

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం వేళ చైనాకు చెందిన ప్రముఖ విద్యావేత్త జుయెకిన్ జియాంగ్ చేసిన సాహసోపేతమైన అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. దుబాయ్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని, ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు పరాభవం తప్పదని ఆయన విశ్లేషించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా, పన్నులు లేని సురక్షిత ప్రాంతంగా దుబాయ్‌కు ఉన్న ఇమేజ్ త్వరలోనే పటాపంచలు కాబోతోందని జియాంగ్ తెలిపారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘దుబాయ్ ఒక అందమైన ఎండమావిలాంటిది. కేవలం ఒకే ఒక్క బాలిస్టిక్ క్షిపణి ఈ ఎండమావిని నాశనం చేయగలదు. ఒకసారి ఆ నమ్మకం చెదిరిపోతే, అది తిరిగి రాదు. రాబోయే వారాల్లోనే అరబ్ దేశాల నుండి, ముఖ్యంగా యూఏఈ నుండి బిలియన్ల కొద్దీ డాలర్లు బయటకు వెళ్లిపోతాయి’’ అని అన్నారు. దుబాయ్ భవిష్యత్తుపై తనకు ఎలాంటి ఆశలు లేవని, ఆ ప్రాంత ఆర్థిక ప్రభావం ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

చైనా నోస్ట్రాడమస్‌గా గుర్తింపు

2024లో జియాంగ్ చేసిన మూడు ప్రధాన అంచనాల్లో రెండు ఇప్పటికే నిజమవడంతో నెటిజన్లు ఆయన్ను చైనా నోస్ట్రాడమస్ అని పిలుస్తున్నారు.

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారు.
  • అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలవుతుంది.
  • ఈ యుద్ధంలో అమెరికా ఓడిపోతుంది, తద్వారా ప్రపంచ క్రమం శాశ్వతంగా మారిపోతుంది.
  • మొదటి రెండు అంచనాలు ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉండటంతో మూడవ అంచనాపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

అమెరికాకు ఇరాన్ గండం?

ఇరాన్ భౌగోళిక స్థితిగతులు అమెరికాకు శాపంగా మారుతాయని జియాంగ్ విశ్లేషించారు. ఇరాన్ పర్వత భూభాగం, అక్కడి దేశీయ ప్రతిఘటన విదేశీ శక్తులకు సింహస్వప్నంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పురాతన ఏథెన్స్ భారీ సైన్యంతో వెళ్లి సిసిలీలో ఓడిపోయినట్లుగానే అమెరికా కూడా ఇరాన్ విషయంలో భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఇరానియన్లు గత 20 ఏళ్లుగా ఈ యుద్ధం కోసం సిద్ధమవుతున్నారని, అమెరికా యుద్ధ తంత్రాన్ని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేశారని తెలిపారు. హౌతీలు, హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలు అమెరికన్ మనస్తత్వాన్ని దెబ్బతీసే వ్యూహంతో ఉన్నాయని, ఇది అమెరికా సామ్రాజ్యాన్ని బలహీనపరుస్తుందని ఆయన విశ్లేషించారు.

జుయెకిన్ జియాంగ్ అంచనాలు నిజమైతే ప్రపంచ ఆర్థిక, రాజకీయ మ్యాప్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల ఆర్థిక స్థిరత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెట్టుబడిదారులను కలవరపెడుతున్నాయి.

Follow Us