AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పేర్లే వినిపిస్తున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ తరుణంలో ఈ దేశాల మధ్య గొడవలేంటో అందరికీ తెలుసు.. కానీ ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? ఒక దేశం పేరు వెనుక వేల ఏళ్ల నాటి బైబిల్ గాథ ఉంటే, మరో దేశం పేరు వెనుక ఆర్యుల వారసత్వం ఉంది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా.. ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?
How Iran And Israel Got Its Name
Krishna S
|

Updated on: Mar 11, 2026 | 8:05 AM

Share

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ మూడు దేశాల పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఈ దేశాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో, వాటి వెనుక ఉన్న అర్థాలేంటో తెలుసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? మత విశ్వాసాలు, పురాతన సంస్కృతులు, సాహసయాత్రల కలయికే ఈ పేర్లు.

ఇరాన్: ఆర్యుల భూమి

నేడు మనం ఇరాన్ అని పిలుస్తున్న దేశాన్ని ఒకప్పుడు ప్రపంచం పర్షియా అని పిలిచేది. కానీ స్థానికులు మాత్రం వేల ఏళ్లుగా దీనిని ఇరాన్ అని పిలుచుకునేవారు. ఇరాన్ అనే పదం మధ్య పర్షియన్ పదం ఎరాన్ నుండి వచ్చింది. దీని అర్థం ఆర్యుల భూమి లేదా ఆర్యుల జాతి. 1935 మార్చి 21న అప్పటి పాలకుడు రెజా షా పహ్లవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ దేశాన్ని పర్షియా అని కాకుండా తమ ప్రాచీన గుర్తింపును ప్రతిబింబించేలా ఇరాన్ అని పిలవాలని అధికారికంగా కోరారు.

ఇజ్రాయెల్: దేవునితో పోరాడినవాడు

ఇజ్రాయెల్ అనే పేరు వెనుక బైబిల్ చరిత్ర దాగి ఉంది. ఇది ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన పేరుగా చెప్పబడుతుంది. బైబిల్ ప్రకారం.. యాకోబు అనే వ్యక్తి ఒక రాత్రి దేవుని దూతతో గొడవపడినప్పుడు, ఆ దూత అతనికి ఇజ్రాయెల్ అని పేరు పెడతాడు. హీబ్రూ భాషలో దీని అర్థం దేవునితో పోరాడినవాడు.1948లో యూదుల కోసం ప్రత్యేక దేశం ఏర్పడినప్పుడు.. జియోన్, యూదా వంటి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ చివరికి తమ 12 తెగల చరిత్రను, పురాతన వారసత్వాన్ని గుర్తుచేసేలా ఇజ్రాయెల్ పేరునే ఖరారు చేశారు.

అమెరికా: ఒక యాత్రికుడి జ్ఞాపకార్థం

అమెరికా పేరు ఏ రాజు లేదా దేవుడి వల్ల రాలేదు. ఒక ఇటాలియన్ సాహస యాత్రికుడి పేరు మీద ఈ ఖండానికి పేరు పెట్టారు. క్రిస్టోఫర్ కొలంబస్ కనుగొన్నది ఆసియా కాదని, అది ఒక కొత్త ఖండమని అమెరిగో వెస్పుచి అనే యాత్రికుడు నిరూపించాడు.1507లో జర్మన్ మ్యాప్ తయారీదారు మార్టిన్ వాల్డ్‌సీముల్లర్, అమెరిగో గౌరవార్థం మ్యాప్‌లో ఆ ప్రాంతానికి అమెరికా అని పేరు పెట్టారు. 1776లో బ్రిటన్ నుండి స్వాతంత్య్రం  పొందాక, థామస్ జెఫెర్సన్ స్వాతంత్ర్య ప్రకటనలో మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే పదాన్ని ఉపయోగించారు. ఇలా ఆయా దేశాలకు ఆ పేర్లు వచ్చాయి.

Follow Us