AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రెండేళ్ల పగ.. రెండు హత్యలు.. 12 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

ఎమ్మిగనూరు మండలంలో పెను సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కందనాతి గ్రామంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన నిందితులు.. సినీ ఫక్కీలో రెండేళ్లు వేచి చూసి మరీ జరిపిన ఈ కిరాతక హత్యకాండ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నీటి గొడవతో మొదలైన చిన్న వివాదం.. రెండు ప్రాణాలను బలిగొని, చివరకు జంట హత్యల రక్తపాతానికి ఎలా దారితీసింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: రెండేళ్ల పగ.. రెండు హత్యలు.. 12 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?
Emmiganur Double Murder Case
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jan 09, 2026 | 8:35 PM

Share

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో ఈ నెల 5న జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, గురువారం సాయంత్రం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ భార్గవి నేతృత్వంలో సీఐ చిరంజీవి, ఎస్ఐ శ్రీనివాసులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మండల పరిధిలోని వెంకటగిరి గ్రామ సమీపంలో ఉన్న ఇటుక బట్టీల వద్ద నిందితులు దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ హత్యకాండలో మొత్తం 20 మంది పాల్గొనగా, ప్రస్తుతం 12 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

హత్యకు దారితీసిన పాత కక్షలు

పోలీసుల విచారణలో ఈ జంట హత్యల వెనుక రెండేళ్ల నాటి ప్రతీకార సెగ ఉన్నట్లు తేలింది. కందనాతి గ్రామంలో 2024లో నీటి వాడకం విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో ప్రస్తుతం హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు దాడి చేయడంతో బిక్కి రవి, బిక్కి నరసింహులు అనే వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన తర్వాత నిందితుల కుటుంబాలు భయంతో గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాయి. దాదాపు రెండేళ్ల పాటు ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్న వీరు, ఇటీవల దసరా పండుగను పురస్కరించుకుని మళ్లీ కందనాతికి తిరిగి వచ్చారు. గ్రామంలోకి అడుగుపెట్టినప్పటి నుండి ప్రత్యర్థులపై నిఘా పెట్టిన నిందితులు, తమ వారిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని పగడ్బందీగా పథకం రచించారు.

కిరాతకంగా దాడి

ఈ నెల 5న పథకం ప్రకారం.. ముందుగా పొలం పనులకు వెళ్లి ట్రాక్టర్‌లో తిరిగి వస్తున్న గోవిందు కుటుంబంపై నిందితులు విరుచుకుపడ్డారు. అనంతరం ఇంటి వద్ద ఉన్న పరమేశ్, పొలంలో ఉన్న వెంకటేష్‌లపై కట్టెలు, కత్తులు, గడ్డపారాలతో అతికిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ప్రస్తుతం కందనాతి గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితులు పూర్తిగా శాంతించే వరకు గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ గొడవలకు తావులేకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..