AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నేహితుల కళ్లెదుటే కొట్టుకుపోయారు.. కాసేపటికే విగతజీవులుగా మారారు.. వద్దని వారిస్తున్నావినకుండా

వారందరూ స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా విహారయాత్రకు(Tour) బయల్దేరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సంతోషంగా గడిపారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన అనంతరం..

స్నేహితుల కళ్లెదుటే కొట్టుకుపోయారు.. కాసేపటికే విగతజీవులుగా మారారు.. వద్దని వారిస్తున్నావినకుండా
Maredumilli
Ganesh Mudavath
|

Updated on: Feb 28, 2022 | 6:36 PM

Share

వారందరూ స్నేహితులు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా విహారయాత్రకు(Tour) బయల్దేరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సంతోషంగా గడిపారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన అనంతరం సమీపంలోని వాగు వద్దకు వెళ్లారు. స్ధానికులు వద్దని వారిస్తున్నా వినకుండా నీటిలో దిగారు. వాగులో కేరింతలు కొడుతూ ఆనందంలో మునిగిపోయారు. అంతే ఒక్క క్షణంలో వారి ఆనందం ఆవిరైంది. వాగులో నీటి ఉద్ధృతి అధికంగా ఉండటం, లోతుల్లోకి వెళ్లిపోవడంతో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. స్నేహితులు చూస్తుండగానే రెప్పపాటులో గల్లంతయ్యారు. కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి కొద్ది దూరంలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన తమ స్నేహితులు.. విగత జీవులుగా మారడాన్ని తోటి స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఓ బైక్ షోరూంలో పనిచేసే సుమారు 14 మంది యువకులు సరదాగా విహార యాత్రకు బయల్దేరారు. ఆదివారం వ్యానులో మారేడుమిల్లి వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వారందరూ పాములేరు వాగు వద్దకు చేరుకున్నారు. వాగులో కేరింతలు కొడుతూ సందడిగా గడిపారు. వాగులో దిగి ఆడుకుంటున్న సమయంలో మనోజ్, వాసు అనే ఇద్దరు యువకులు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోసాగారు. వీరిని గమనించిన తోటి స్నేహితులు.. కాపాడేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన తోటి స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటి తర్వాత కొంత దూరంలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వాగులో దిగవద్దని వారిస్తున్నా.. వినకుండా నీటిలో దిగారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో నీటి ఉద్ధృతి అధికంగా ఉండటం, వాగు గురించి సరైన అవగాహన లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. ఇలా ఏటా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి వాగు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Also Read

Watch Video: ఈ క్యాచ్ ఓ ‘అద్భుతం’.. అలా ఎలా పట్టావయ్యా బాబు.. షాకవుతోన్న నెటిజన్లు.. వైరల్ వీడియో

Telangana: వాగులో మరమ్మత్తు తవ్వకాలు.. 25 అడుగుల లోతులో బయటపడిన ఊహించని అద్భుతం

Russia Ukraine War: వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన కర్ణాటక.. ఆ రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన ఫ్రీ..