Andhra Pradesh: మా జీవితాల్లో చీకట్లు తొలగేదెన్నడు..?! దీపావళి వేళ కాగడాలతో గిరిజనుల నిరసన..
వాళ్లంతా అమాయక ఆదివాసీలు..! మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని కొండపై ఆ గ్రామం. స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా .. కటిక చీకట్లోనే వాళ్ళ బతుకులు.

వాళ్లంతా అమాయక ఆదివాసీలు..! మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని కొండపై ఆ గ్రామం. స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా .. కటిక చీకట్లోనే వాళ్ళ బతుకులు. ఎంతమందికి మొరపెట్టుకున్నా.. మరింత మంది చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. వాళ్ల గ్రామానికి విద్యుత్ కాంతులు అందనంత దూరంలోనే..! దేశమంతా దీపావళి సంబరాలు ఆనందంగా జరుపుకుంటుంటే.. వాళ్లు మాత్రం తమ గ్రామానికి విద్యుత్ వెలుగులు నింపాలని కాగడాల ప్రదర్శన చేశారు. లక్ష్మీ కటాక్షంతో తమ జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఎవరా ఆదివాసీలు.? ఏమిటా గ్రామం..?!
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయితీ లో బూరిగ అనే గిరిజన గూడెం. దాదాపు 30 గిరిజన కుటుంబాలకు పైగా ఆ కొండపై జీవనం సాగిస్తుంటాయి. ఏ అవసరం ఉన్నా సరే ఆ కొండ దిగాల్సిందే. కిలోమీటర్ల మేర సాహసంతో ప్రయాణం చేయాల్సిందే. అమాయక ఆదివాసీలు ఉండే ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా వాళ్లకి విద్యుత్ వెలుగులు అంటే తెలియదు. చీకట్లోనే వాళ్ళ బతుకులు. సూర్యోదయం అయితేనే వాళ్ళకి వెలుగు.. సూర్యాస్తమయంతో మళ్లీ చీకట్లోనే మగ్గాల్సిందే..! దట్టమైన అడవిలో.. కారు చీకటిలో… జంతువుల భయంతో వాళ్ళ జీవనం. రాత్రి అయితే చాలు.. ఎప్పుడు తెల్లవారుతుందా అని అర చేతిలో ప్రాణాలు పెట్టుకుంటూ భయం గుప్పిట్లో వాళ్ళ బతుకులు..!
నరక చతుర్దశి రోజు దేశమంతా దీపావళి పండగ తో సంబరాలు చేసుకుంటే… ఈ గూడెంలో గిరిజనులు మాత్రం మా జీవితాల నుంచి చీకట్లు తొలగిపోవాలని అడవి దేవతకు వేడుకున్నారు. చేతిలో కాగడాలు పట్టుకొని.. ప్రదర్శన చేశారు. చీకట్లో బతుకుతూ ఉన్నాం.. మాకు నేటికీ కరెంట్ సౌకర్యం లేకపోవడంతో రాజ్యాంగంలో కల్పించిన టువంటి జీవించే హక్కు కూడా పాలకులు మాకు సమకూర్చడం లేదు. ఇప్పటికైనా మా గ్రామాలకు కరెంట్ సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. గ్రామస్తులతో పాటు.. గిరిజన సంఘం నాయకులు బూరుగ పెంటయ్య. సోముల సన్యాసిరావు, సోమల అప్పలరాజు. కో నపర్తి సింహాచలం, గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా పాలకులు వీరి గోడు విని.. ఆ గూడెంలో విద్యుత్ కాంతులు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




– ఖాజా, వైజాగ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
