Private Travels: సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే చర్యలు తప్పవంటున్న అధికారులు!
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ అధిక ఛార్జీలతో దోచుకుంటున్నాయి. విమాన ఛార్జీలకు సమానంగా బస్ టికెట్లు పెంచడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రవాణా శాఖ సీరియస్ అయింది. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ (9281607001) ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు సూచించింది.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికుల రద్దీ పెరగడంతో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ విపరీతంగా చార్జీలు పెంచాయి. బస్ టికెట్ ధరలు విమాన ప్రయాణానికి సమానంగా ఉండటంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు యజమానులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రవాణాశాఖకు చేరాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ కీలక హెచ్చరికలు జారీ చేశారు రవాణా శాఖ అధికారులు. ఎక్కడైనా అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అధిక చార్జీలపై కఠిన చర్యలు
పండగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలకు సిద్దమైనట్టు రవాణాశాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 9281607001 ను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికులను దోచుకోవాలని ఎవరూ చేసినా ఊరికే వదిలేది లేదని అలాంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలకు లోబడే సేవలు అందించాలని, ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
ప్రైవేటు ట్రావెల్స్ అధిక చార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని రవాణాశాఖ తెలిపింది. ప్రయాణికులు సమాచారం అందిస్తే సంబంధిత ట్రావెల్స్‌పై వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
భద్రతపై రాజీ లేదు: జేటీసీ
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని సంయుక్త రవాణా కమిషనర్ ఎ. మోహన్ స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా స్థానిక డీటీసీ కార్యాలయంలో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే మోటారు వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించి విస్తృత తనిఖీలు చేపట్టామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
