Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మంగళవారం 12 గంటల పాటు ఆలయం మూసివేత.. పూర్తి వివరాలివే
25న ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచనున్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. దర్శనాలకు సంబంధించి సోమవారం ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోరు.
సూర్యగ్రహణం సందర్భంగా మంగళవారం ( అక్టోబర్25) 12 గంటల పాటు తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 25న ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి ఉంచనున్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. దర్శనాలకు సంబంధించి సోమవారం ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోరు. అలాగే లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ రద్దు చేయనున్నారు. గ్రహణం పూర్తయ్యాక ఆలయ శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. కాగా గ్రహణం తర్వాత కూడా కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.
శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
కాగా దీపావళి సందర్భంగా శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ అధికారుల సమక్షంలో ఈ ఆస్థాన వేడుకను నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించారు. బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను ముస్తాబు చేసి ఈ ఆస్థానం నిర్వహించారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. ఇక ఆదివారం స్వామివారిని 80,565మంది భక్తులు దర్శించుకోగా.. 31,608మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో భక్తులు హుండీలలో స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.6.30 కోట్లు వచ్చింది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.