Tirupati Stampde: భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆధ్యాత్మిక నగరం.. ఇవాళ తిరుపతికి సీఎం చంద్రబాబు
ఏటా వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. సంక్రాంతి సమయంలో వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. టోకెన్ల జారీకి 24 గంటలకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి చేరుకున్నా టీటీడీ, పోలీస్ సిబ్బంది అప్రమత్తం కాలేదు.
ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష వినిపించింది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆ ఏడుకొండల వాడి సన్నిధిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పెను విషాదంగా మారింది. బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టోకెన్ల కోసం వెళ్లి పలువురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తిరుపతిలో జరిగిన తోపులాట ఘటనలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు.
డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. అన్ని విషయాలపై ఆరాతీశారు. ముందుజాగ్రత్త చర్యల్లో విఫలం కావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా.. బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కౌంటర్ల నిర్వహణ, భద్రతపై పునఃసమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు..
తిరుపతికి సీఎం చంద్రబాబు..
ఇవాళ సీఎం చంద్రబాబు తిరుపతికి వెళ్లనున్నారు. మ.12 గంటలకు తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు.. రుయా, స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం టీటీడీ ఈవో, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.
ఆరుగురు మృతి.. 48 మంది భక్తులకు గాయాలు..
ఏటా వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. సంక్రాంతి సమయంలో వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. టోకెన్ల జారీకి 24 గంటలకు ముందే భక్తులు పెద్ద సంఖ్యలో తిరుపతి చేరుకున్నా టీటీడీ, పోలీస్ సిబ్బంది అప్రమత్తం కాలేదు. ముఖ్యంగా టోకెన్ జారీ కేంద్రాల్లోకి భక్తుల్ని అనుమతించే సమయంలో సమన్వయం లోపించింది. గంటల తరబడి ఎదురు చూసిన భక్తులు గేట్లు తెరిచిన వెంటనే భక్తులు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆరుగురు మృతి చెందడంతోపాటు మరో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారికి రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలతో రుయా హాస్పిటల్ ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది. రుయా ఆస్పత్రికి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలరావు చేరుకొని వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం..
సీఎం ఆదేశాల మేరకు ఆఘమేఘాలపై తిరుపతికి చేరుకున్నారు దేవాదాయ శాఖ, రెవెన్యూ, హోమ్ మంత్రి .. తిరుపతిలో ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుందని.. మృతుల కుటుంబాలకి అండగా నిలుస్తామని.. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గాయపడిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య అందిస్తున్నామని తెలిపారు.