TDP: పెదకూరపాడు టీడీపీ టికెట్ ఎవరికి.. అయోమయంలో క్యాడర్
సీనియర్ ను తప్పించి జూనియర్ ను బరిలోకి దించాలని టిడిపి అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే సీనియర్ మాత్రమే తనకే టికెట్ అంటున్నారు. సీనియర్ అభిమానులు, అనుచరులు తలో ఒక మీటింగ్ పెట్టి సీటు తమదే అంటున్నారు. దీంతో అక్కడి టిడిపిలో అయోమయం నెలకొంది. గెలవాల్సిన సీట్లలో కూడా ఈ టికెట్ల లొల్లి ఏందని కార్యకర్తలు అనుకుంటున్నారు.

పెదకూరపాడు టీడీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు ఈసారి టికెట్ లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అనుచరులు, మద్దతుదారులు సమావేశాలు పెట్టి కొమ్మాలపాటికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త నాయకులతో నష్టమే తప్ప పార్టీకి కలిసొచ్చేదేమీ ఉండదంటున్నారు. దీంతో నియోజకవర్గంలో అసలేం జరుగుతుందో, చివరికి అభ్యర్థెవరో అంతుపట్టక తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. 2009లో కొమ్మాలపాటి టీడీపీలో చేరి పెదకూరపాడు నుంచి పోటీ చేశారు. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు, ఆ ఎన్నికల్లో కన్నా లక్ష్మీ నారాయణ గుంటూరుకు వెస్ట్ నియోజకవర్గానికి మారడంతో శ్రీధర్ సులభంగానే విజయం సాధించారు. ఆ తర్వాత 2014లోనూ రెండోసారి గెలిచారు. ముచ్చటగా మూడోసారి 2019లో బరిలోకి దిగి వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్ రావు చేతిలో ఓడిపోయారు.
కొమ్మాలపాటి శ్రీధర్ పెదకూరపాడు టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నా.. వైసీపీ సిట్టింగ్‌ని ఢీకొట్టలేరన్న అభిప్రాయంతో ఉందట పార్టీ అధిష్ఠానం. అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారంతో కొమ్మాలపాటి టికెట్ తనకేనని చెబుతూ వచ్చారు. అయితే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి అంటూ.. సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు పార్టీశ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన కొమ్మాలపాటి వెంటనే అనుచరులతో సమావేశమై చర్చించారు. తనకే టికెట్ వస్తుందని అనుచరుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అయితే అధినాయకత్వం ఆలోచన వేరేగా ఉందని తెలుసుకున్న కొమ్మాలపాటి అనుచరులు ఆత్మీయ సమావేశాలు పెట్టుకుని టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పెదకూరపాడులో అన్నివిధాలా బలంగా ఉన్న నంబూరు శంకర్ రావును ఢీకొట్టేందుకు కొమ్మాలపాటి సరిపోరన్న అభిప్రాయానికి వచ్చిందట టీడీపీ అధిష్ఠానం. భాష్యం ప్రవీణే అక్కడ బలమైన అభ్యర్థి అవుతారన్న ఆలోచనతో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. నారా లోకేష్ కు సన్నిహితుడిగా ఉన్నారు భాష్యం ప్రవీణ్. గతంలో చిలకలూరిపేట నుంచి పోటీ చేసేందుకు ప్రవీణ్ సిద్ధమయ్యారు. అయితే ప్రత్తిపాటి పుల్లారావు గట్టిగా అడ్డుపడటంతో ప్రవీణ్ పెదకూరపాడుకు షిఫ్ట్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే శంకర్ రావు, టీడీపీ టికెట్ ఆశిస్తున్న ప్రవీణ్ వరుసకు మామ అల్లుళ్లు అవుతారు. ఇద్దరిదీ తాడికొండ మండలం పెదపరిమి. దీంతో వచ్చే ఎన్నికల్లో మామ అల్లుళ్ల మధ్య ఫైట్ తప్పేలా లేదంటున్నారు పెదకూరపాడు పబ్లిక్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
