AP News: అందుకే భర్తకు ముచ్చటగా మూడో పెళ్లి.. కారణం తెలిస్తే ఇద్దరు భార్యలకు సలాం కొట్టాల్సిందే
అల్లూరి జిల్లా ఏజెన్సీలో సాగేని పండన్న అనే గిరిజన రైతు మూడో పెళ్లి తీవ్ర చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అప్పటికే ఉన్న ఇద్దరు భార్యలు కలిసి.. మూడో పెళ్లి చేయడం విశేషం. అది కూడా వాళ్ళిద్దరే.. పెళ్లి శుభలేఖలు ముద్రించి.. తల్లి తండ్రి లేని తన భర్తకు..
అల్లూరి జిల్లా ఏజెన్సీలో సాగేని పండన్న అనే గిరిజన రైతు మూడో పెళ్లి తీవ్ర చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎందుకంటే అప్పటికే ఉన్న ఇద్దరు భార్యలు కలిసి.. మూడో పెళ్లి చేయడం విశేషం. అది కూడా వాళ్ళిద్దరే.. పెళ్లి శుభలేఖలు ముద్రించి.. తల్లి తండ్రి లేని తన భర్తకు పెళ్లి పెద్దలుగా మారి.. ఇంటింటికి వెళ్లి తమ భర్త మూడో పెళ్లికి రావాలంటూ ఆహ్వానం పలికారు. తమ కుటుంబంలోకి మరో గిరిజన యువతికి మనసారా ఆహ్వానించారు ఆ ఇద్దరు భార్యలు. తమ తోబుట్టువులా పెళ్లి చేశారు. ఇంతకీ అంత పెద్ద మనసు చాటుకొని తమ భర్తకు మూడో పెళ్లి చేయడం వెనుక గుండెలు పిండేసే ఓ వాస్తవం కూడా దాగి ఉంది. అందుకే ఇద్దరు భార్యలు పండన్న కలిసి.. ఒక నిర్ణయం తీసుకొని.. అందరి సమ్మతితోనే మూడో పెళ్లి చేసుకున్నాడు పండన్న. అందుకు ఆ ఇద్దరు భార్యలు ఆశీర్వదించారు.
అసలు విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం.. గుండెలు పంచాయితీ కించూరు గ్రామంలో సాగేని పండన్న.. వాళ్ల తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. కానీ ఆ సంతానం మమకారం పూర్తిగా తీరాక ముందే ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 97-98లో తల్లి, తండ్రి లేని అనాధగా మారాడు పండు అన్న. అప్పటి నుంచి పండన్నకు ఎవరూ లేరు. తల్లి తండ్రి లేని పండు అన్న గ్రామస్తులు, బంధువుల సహకారంతో ఎదిగాడు. కూలీ పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటూ జీవనం సాగించేవాడు.
2001లో.. ఆ తరువాత..
2001లో అప్పలమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు పండన్న. వివాహం జరిగి నాలుగేళ్లయిన ఆమెకు సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తలిద్దరూ మానసిక వేదనకు గురయ్యారు. పిల్లల్ని లేని ఈ జీవితం ఎందుకని అప్పలమ్మ కూడా మనస్థాపానికి గురైంది. మరోవైపు తల్లి తండ్రిని అనాధగా పెరిగిన తనకు.. ఇక పిల్లలు లేకపోవడం పండన్నకు తీవ్రంగా కలచివేసింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. భర్తకు మరో వివాహం చేయాలని అప్పలమ్మ పెద్ద మనసు చాటుకుంది. విషయాన్ని పండన్నకు చెప్పి ఒప్పించడంతో.. 2005లో పార్వతమ్మ అనే మహిళతో పండన్నకు వివాహం జరిగింది. ఆ సమయంలో మొదటి భార్య అప్పలమ్మ స్వయంగా అన్ని దగ్గరుండి చూసుకుంది. తన భర్త కోసం రెండో భార్యను మనసారా ఆహ్వానించింది. అప్పలమ్మ పండన్న అనుకున్నట్టుగానే.. రెండో భార్య పార్వతమ్మకు బాబు పుట్టాడు. ఇద్దరు భార్యలు బాబుతో పండన్న కాపురం సాఫీగా సాగింది.
అందుకే ఆ వివాహం..
అయితే మరో సంతానం కోసం ప్రయత్నించినప్పటికీ కలగలేదు. దీంతో ఆ ఇద్దరు భార్యలు.. మరో సంతానం కలిగితే కొడుకుకు తోడుగా ఉంటుంది. ఒంటరిగా జీవితంలో పెరిగిన పండన్నలాగే అతని కొడుకు పరిస్థితి కూడా రాకూడదని అనుకున్నారు. దాదాపు 17 ఏళ్లు వేచి చూశారు. కొండన్న కూడా మరో సంతానం ఉంటే తన కొడుకుకు తోడు ఉంటుందని అనుకున్నాడు. అయినప్పటికీ రెండో సంతానయోగం కలగకపోవడంతో.. అప్పలమ్మ, పార్వతమ్మ కలిసి.. సహృదయంతో పండన్నకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. తమ భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు. అందుకు తమ బంధువైన లక్ష్మీ అలియాస్ లావ్యను తమ తోబుట్టువుల తెచ్చుకోవాలని అనుకున్న ఆ ఇద్దరు భార్యలు.. పెద్దలను రాయబరానికి పంపారు. వాస్తవానికి అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఎవరికైనా పిల్లని ఇవ్వాలంటే అందరూ సందేహిస్తారు. కానీ పండన్న ఆ ఇద్దరు భార్యలతో ఉన్న అన్యోన్యం, పండన్న మనస్తత్వాన్ని గుర్తించి లావణ్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో ఇక పెళ్లి ముహూర్తం ఖరారైంది.
ముగ్గురు భార్యలతో ముచ్చటగా ఫోటోలు దిగి..
శుభలేఖలు ముద్రించి.. పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభలేఖల్లా కూడా ఇద్దరు భార్యలు అందరినీ ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు. ఇంటింటికి వెళ్లి శుభలేఖనం పంచారు. బంధుమిత్రులను ఆహ్వానించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ పండన్న ఇద్దరు భార్యలు అప్పలమ్మ పార్వతి పేర్లను ముద్రించారు. దీంతో జూన్ 25 ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. పండన్న బంధుమిత్రులు గ్రామ పెద్దలు నవవధువు లక్ష్మీ తరఫున బంధువులు కూడా హాజరై గ్రాండ్‌గా వివాహం జరిపించారు. సంసారం సుఖసంతోషాలతో సాగిపోవాలని ఆశీర్వదించారు.
పండన్న ఏమన్నాడంటే..
‘నాకు పుట్టినప్పుడు నుంచి ఎవరూ లేని అనాధగా పెరిగా.. అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. కూలి చేసుకుని బతికా. మా అమ్మా నాన్నకు నేను ఒక్కడినే.. నాకు కూడా కొడుకు ఒక్కడే అయ్యాడు. నా పరిస్థితి నా కొడుకుకు రాకూడదని.. ఇద్దరు భార్యలతో కలిసి కూర్చుని మాట్లాడకున్నాం. లావ్య కూడా బంధువులే కావడంతో.. రాయబారం పంపేసరికి పెద్ద మనసుతో ఒప్పుకొని ఆశీర్వదించారు. లావ్యకు పెద్ద కుటుంబమే. 30 కుటుంబాల్లో బంధువులు ఉన్నారు. నా పరిస్థితి, నా స్వభావం వాళ్ళందరికీ తెలుసు. అప్పుడే వాళ్ళ ఆడపిల్లని మా ఇంటికి పంపాలని నిర్ణయించారు. ఇద్దరు భార్యలతో ఇప్పటివరకు ఎలా ఉన్నానో.. లావ్య కూడా అలాగే చూసుకుంటా. నాకంటే నా ఇద్దరు భార్యలు పెద్ద మనసు చాటుకోవడం అదృష్టం. ఎవరికి ఏ కష్టం రానీయకుండా అన్యోన్యంగా ఉంటాం.’ అని పండన్న తన మనసులోని మాట పంచుకున్నాడు.
ఇదండీ ఇద్దరు భార్యల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న పండన్న వివాహం వెనుక ఉన్న అసలు కథ. ఒకే వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఏంటని కొంతమంది నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ.. ఇద్దరు భార్యల ఆశీర్వాదంతోనే.. మరో గిరిజన యువతికి కొత్త జీవితం ఇచ్చిన విషయం తెలుసుకొని.. లక్కీయెస్ట్ ఫెలో గురు అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరికొందరు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..