CJI NV Ramana: నాపై తెలుగు ప్రజలు చూపిన ప్రేమానురాగాలు ఎన్నటికీ మర్చపోలేనివి: లేఖలో సీజే ఎన్వీ రమణ

CJI NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఏపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు..

CJI NV Ramana: నాపై తెలుగు ప్రజలు చూపిన ప్రేమానురాగాలు ఎన్నటికీ మర్చపోలేనివి: లేఖలో సీజే ఎన్వీ రమణ
Follow us

|

Updated on: Dec 27, 2021 | 9:13 PM

CJI NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఏపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన సొంత గ్రామానికి బయలుదేరి వివిధ ప్రారంభోత్సవాలను, కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన రాకతో ఏపీ ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత తెలుగు ప్రజలకు లేఖ రాశారు. ఆయనకు స్వాగతం పలికిన తీరుపై ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో రోజుల తర్వాత సొంత రాష్ట్రంలో పర్యటించడం తన లేఖలో పేర్కొన్నారు. న్యాయమూర్తి ఎన్వీ రమణ మాటల్లో..

ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.. ఒకసారి మా ఊరు పొన్నవరం వెళ్లి రావాలని. అయినవాళ్లందరినీ పలకరించి రావాలని అనుకున్నాను. సుప్రీం కర్టుకు శీతాకాలం సెలవులు ప్రకటించడంతో నా ఆలోచన అమల్లో పెట్టే అవకాశం దొరికిందని తన లేఖలో పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఈనెల 24వ తేదీ ఉదయం ఎంతో ఉత్సకతతో స్వగ్రామానికి సకుటుంబ సమేతంగా బయలుదేరాను. గరికపాడు దగ్గర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాలు మోపాను. ఆంధ్ర ప్రజలు నా కోసం బారులు తీరారు. స్వాగత వచనాలతో, నినాదాలతో పూల వానతో, అపారమైన ప్రేమానురాగాలతో ముంచెత్తిన తీరు నేనూ ఎన్నటికీ మర్చిపోలేను.. నా కుటుంబ సభ్యులూ ఎప్పటికీ మర్చిపోలేరు అంటూ చెప్పుకొచ్చారు.

బంధుత్వాలకంటే మిత్ర బంధానికే పెద్ద పీట వేసే పొన్నవరం ఊరు ఊరంతా తరలి వచ్చి నన్ను, నా కుటుంబ సభ్యులను ఎడ్ల బండిపై పొలిమేరల నుంచే ఊరేగింపులా తీసుకెళ్లారు. మూలాలు మరువరాదని బలంగా విశ్వసించే నేను.. మా ఇద్దరు కుమార్తెలకు, ఇద్దరు అల్లుళ్లకు, ఇద్దరు చిన్నారి మనుమరాళ్లకు తొలిసారి నా ఊరు చూపించగలగడం ఎంతో సంతృప్తి కలిగింది. పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు తరుముకొచ్చాయి. ఆప్తులు ఎందరో చాలా కాలం తర్వాత నన్ను కలిశారు. భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ‘అబ్బాయ్‌ రమణా’ అని పెద్దలు పలకరించిన వైనం నన్ను పులకరింపజేసింది.

నా ఊరి ప్రయాణం వార్త బయటకు పొక్కగానే ఎన్నో ఆహ్వానాలు అందాయి. అందులో కొన్ని మాత్రమే అమోదించగలిగాను. రాష్ట్ర గవర్నర్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో రాజధాని ప్రాంతంలో నా తొలి పర్యటన పురస్కరించుకుని అతిథ్యమిచ్చారు. వారికీ, రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన పెద్దలు, ప్రముఖులు, మంత్రులు, అధికారులందరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపారు జస్టిస్‌ ఎన్వీ రమణ. ప్రజాప్రతినిధులు, రాజకీయ, సామాజిక పక్షాల ప్రతినిధులు ఎందరో నన్ను పకలరించేందుకు వచ్చారు. అందరికీ ధన్యవాదాలు అంటూ లేఖలో తెలిపారు.

న్యాయవాద వృత్తిలో నాకు నడక నేర్పిన ‘బెజవాడ బార్‌ అసోసియేషన్‌’ ఇంకా ‘ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌’, ‘ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉద్యోగుల సంఘం’ రోటరీ క్లబ్‌ విజయవాడ అతి స్వల్ప వ్యవధిలో అసాధారణమైన ఏర్పాట్లతో నన్నూ, నా సతీమణి శివమాలనూ సత్కారాలతో ముంచెత్తారు. కొందరు పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి తరలి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి నన్ను ఎంపిక చేసిన సిద్ధార్థ న్యాయ కళాశాలకు, హాజరైన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ పర్యటనలో నా వెంట ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చూపించిన గౌరవం, అభిమానం చెప్పుకోలేనిది. న్యాయ వ్యవస్థ పట్ల, న్యాయమూర్తుల పట్ల తెలుగు ప్రజలు చూపిన గౌరవం చూసి వారెంతో సంతోషించారు.

నా నుంచి ఏమి ఆశించకుండా స్వంత పనులన్నీ మానుకొని గంటల తరబడి వేచి ఉన్నారు. అలాగే భవ్య దర్శనం కల్పించిన విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, చందోలు శ్రీబగళాముఖీ అమ్మవారి దేవస్థానం,ఇంకా మా ఊరి ఆలయాల పాలక మండళ్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే క్రిస్మస్‌ పర్వదినం రోజున ఆశీర్వాదాలు అందించిన క్రైస్తవ మత పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

24వ తేదీన హైదరాబాద్‌లో బయలుదేరింది మొదలు ఏపీ సరిహద్దు వరకు తిరిగి ఈ వేళ సరిహద్దు నుంచి హైదరాబాద్‌ చేరే వరకు సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ పోలీసు సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని న్యాయమూర్తి ఎన్వీ రమణ తన లేఖలో పేర్కొన్నారు. సమయాభావం వల్ల ఎందరినో కలవడం లేదని, మరోసారి అందరిని కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తన ‘లేఖ’లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

AP High Court: ఏపీ సర్కార్‌కు మరోసారి హైకోర్టులో ఎదురు దెబ్బ.. జీవో 53, 54లు కొట్టివేత..

Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విశాఖపట్నం-అరకు మధ్య ప్రత్యేక రైళ్లు