RajyaSabha Elections: రాజ్యసభ ఎన్నికల బరిలోకి టీడీపీ.. గంటా రాజీనామా ఆమోదంపై న్యాయ పోరాటం
2012 ఫిబ్రవరి 12 వ తేదీన గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రెండుమూడుసార్లు స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదించాలని కోరినప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం అంశం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్న సమయంలో ఒక ఎమ్మెల్యే రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై పార్టీ నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు. 2012 ఫిబ్రవరి 12 వ తేదీన గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రెండుమూడుసార్లు స్పీకర్ ను కలిసి తన రాజీనామా ఆమోదించాలని కోరినప్పటికీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ హఠాత్తుగా గంటా రాజీనామా ఆమోదం పొందటం తెలుగుదేశం పార్టీకి మింగుడుపడటం లేదు. సుమారు మూడేళ్ల తర్వాత స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల న్యాయపోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. రాజకీయ కోణంలో ఇప్పుడు రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ వాదన. అయితే ఎమ్మెల్యే సీటు కోసం తనకు అభ్యంతరం లేదని, తన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని చెబుతూనే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేలా అవకాశం ఇవ్వాలని న్యాయపోరాటం చేస్తానని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా గంటాకు పూర్తి మద్దతుగా నిలుస్తుంది. ఈ విషయంపై చంద్రబాబే స్వయంగా గంటాతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదని తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా బలం లేకపోయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచేలా తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు..
వచ్చే మార్చి నెలలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. దీంతో గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ అంశంపై పార్టీలో కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేదు. తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీలో చేరగా మరో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు…ఈ నలుగురు ఎమ్మెల్యేల సాయంతోనే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక సీటు దక్కించుకుంది..ఇదే ఫార్ములాను రాజ్యసభ ఎన్నికల్లో కూడా అనుసరించేలా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ సీటు దక్కాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అంటే మరో 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి అవసరం ఉంది. తాజాగా గంటా రాజీనామా ఆమోదంతో మరో 22 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ లెక్కలన్నింటినీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం గమనిస్తోంది. సంఖ్యాబలం లేకుండా సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ సరైనదా కాదా అనే ఆలోచన చేస్తూనే వైసీపీలో ఉన్న తాజా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే విషయాన్ని చెబుతున్నారు. వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలే మమ్మల్ని రాజ్యసభ బరిలో నిలవాలని కోరుతున్నారని బుచ్చయ్య చెప్పుకొచ్చారు. తమతో చాలామంది టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో తమకున్న బలం తగ్గకూడదనే గంటా విషయంలో న్యాయపోరాటం చేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తోంది. టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం మైండ్ గేమ్ కోసమేనా లేక నిజంగానే ఇంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకున్న ఎమ్మెల్యేలు కూడా మరింత సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు గనుక పార్టీ మారితే మళ్లీ వేటుపడే అవకాశం ఉండటంతో ఆయా ఎమ్మెల్యేల విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియదు గానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…