AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP-Janasena Manifesto: సూపర్ సిక్స్‌తో టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం.. ముహూర్తం ఇదే!

ఉమ్మడి మేనిఫెస్టో విడుదల పైన రెండు పార్టీలు దృష్టి సారించాయి. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలనే దానిపై రెండు పార్టీలు అధినేతలు అనేకసార్లు సమావేశమై చర్చించారు. గతేడాది రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ అంశాలతో మేనిఫెస్టో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు.

TDP-Janasena Manifesto: సూపర్ సిక్స్‌తో టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం.. ముహూర్తం ఇదే!
TDP Janasena Manifesto
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Mar 07, 2024 | 3:00 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలుగుదేశం – జనసేన పార్టీల కూటమి దూకుడుగా ముందుకెళ్తుంది. ఇప్పటికే మొదటి విడతలో 99 మంది ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, జనసేన పార్టీ ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

అభ్యర్థుల ప్రకటన తర్వాత వివిధ ప్రాంతాల్లో రెండు పార్టీల నుంచి వచ్చిన అసంతృప్తులను ఎప్పటికప్పుడు బుజ్జగిస్తూ పరిస్థితిని చక్కబట్టే ప్రయత్నాలు రెండు పార్టీలు అధినేతలు చేశారు. ఇదే సమయంలో టికెట్లు రాని ఆశవాహులను సర్ధిచెబుతూనే, ఏదో ఒక హామీ ఇచ్చి పంపించి వేస్తున్నారు. ఇక రెండో జాబితా పైన రెండు పార్టీలు అధినేతలు కసరత్తు చేస్తున్నారు. జనసేన పార్టీకి ఎక్కడెక్కడ స్థానాలు కేటాయించాలని దానిపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా మిగిలిన స్థానాల్లో టిడిపి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగంగా కొనసాగుతుంది. అటు జనసేన పార్టీ కూడా రెండో విడత జాబితా కోసం కసరత్తు వేగవంతం చేసింది. త్వరలోనే రెండో విడత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని రెండు పార్టీలు ప్రకటిస్తున్నాయి.

ఇక ఉమ్మడి మేనిఫెస్టో విడుదల పైన రెండు పార్టీలు దృష్టి సారించాయి. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలనే దానిపై రెండు పార్టీలు అధినేతలు అనేకసార్లు సమావేశమై చర్చించారు. గతేడాది రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సూపర్ సిక్స్ అంశాలతో మేనిఫెస్టో ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత జనసేనతో పొత్తు కుదరడంతో జనసేన పార్టీ తరఫున మరొక ఆరు అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ ఉమ్మడి మేనిఫెస్టోను మార్చి 17న చిలకలూరిపేటలో విడుదల చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి.

ఉమ్మడి మానిఫెస్టో విడుదల చేయనున్న చంద్రబాబు – పవన్

ఎన్నికల ప్రచారం కోసం రెండు పార్టీలు కలిసి ఉమ్మడి బహిరంగ సభలో నిర్వహిస్తున్నాయి.ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభను నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక రెండో బహిరంగ సభను పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించాలని రెండు పార్టీల కూటమి నిర్ణయించింది మార్చి 17వ తేదీన చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. దాదాపు 10 లక్షల మందితో ఈ బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

మరోవైపు చిలకలూరిపేట బహిరంగ సభ ద్వారానే ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. సూపర్ సిక్స్ అంశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలకమైన అంశాలతో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్‌ ద్వారా మహిళలు, రైతులు, యువత, బీసీలకు సంబంధించి కీలక అంశాలను పొందుపరిచారు. వీటితోపాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం అంశాలను కూడా మేనిఫెస్టోలో జత చేసినట్లు సమాచారం. భవన నిర్మాణ కార్మికులు, యువతకు ఉపాధి, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఇన్సెంటివ్‌లు వీటితోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పల్లె అంశాలతో మేనిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది.

రెండు పార్టీల కూటమి అధికారింలోకి వస్తే అన్ని వర్గాలను వృద్ధిలోకి తీసుకురావడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీతో పొత్తుల అంశంపై స్పష్టత వస్తే మేనిఫెస్టోలో మరికొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న మేనిఫెస్టో విడుదల ఈనెల 17న చిలకలూరిపేట వేదికగా విడుదల చేసేందుకు తెలుగుదేశం – జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..