TDP: శరవేగంగా టీడీపీ మహానాడు ఏర్పాట్లు – ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం
మహానాడు అదిరిపోవాలే...! భారీ విజయం తర్వాత జరుగుతున్న తొలి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేయాలే...! అనేలా టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. స్థానిక నేతలే కాదు... టీడీపీ కీలక నేతలు సైతం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. కార్యక్రమం విజయవంతం అయ్యేలా వరుస సమీక్ష నిర్వహిస్తున్నారు.

కడప నగరంలోని పబ్బాపురం దగ్గర నిర్వహించనున్న తెలుగు దేశం పార్టీ మహానాడు ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. మహానాడు నిర్వహణ కమిటీలతో మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. సభా ప్రాంగణాన్ని ఎలా ఏర్పాటు చేయాలి…? వీఐపీల భద్రత, ఆహారం, తాగునీరు, వసతులపై ప్రధానంగా సమీక్షించారు. కనివినీ ఎరుగని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత జరుగుతున్న మహానాడు కావడంతో… ఏ చిన్న సమస్య కూడా తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు మంత్రులు.
ఈ సమీక్షా సమావేశానికి రాయలసీమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు… హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత, అనగాని సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. సభావేదిక దగ్గర్నుంచి పార్కింగ్ ఏర్పాట్ల వరకూ అన్నింటిపైనా సమీక్షించారు.
టీడీపీ మహానాడు ఈనెల 27,28,29 తేదీల్లో జరగనుంది. మహానాడులో రకరకాల వంటకాల తయారీ, వడ్డింపులకు వీలుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు బహిరంగ సభ ప్రాంగణం, ప్రతినిధుల సమావేశాలు, భోజన ఏర్పాట్లకు 125 ఎకరాల స్థలం వినియోగిస్తున్నారు. వేలాదిగా రానున్న వాహనాల కోసం పార్కింగ్‌కు 300 ఎకరాల స్థలాన్ని చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. ప్రాంగణం అలంకరణ, బందోబస్తుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి కడపలో జరగబోయే మహానాడు నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంటుందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. పక్కా ప్లానింగ్‌తో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెబుతున్నారు.
మొత్తంగా…మూడ్రోజుల మహానాడులో మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చిస్తారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.