Andhra Pradesh: ప్రధాని మోదీతో ఫోటోను ట్వీట్ చేసిన చంద్రబాబు.. విషయం ఏమిటంటే..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. శాసనసభ ఎన్నికలు రావడానికి మరో ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికి ఇప్పటినుంచే అన్ని పార్టీలు ఏపీలో ఎన్నికలపై దృష్టిసారించాయి. ముందస్తు ఎన్నికలు రావొచ్చంటూ..

Andhra Pradesh: ప్రధాని మోదీతో ఫోటోను ట్వీట్ చేసిన చంద్రబాబు.. విషయం ఏమిటంటే..?
TDP Chief Chandrababu NaiduImage Credit source: TV9 Telugu
Follow us
Amarnadh Daneti

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 22, 2022 | 3:14 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. శాసనసభ ఎన్నికలు రావడానికి మరో ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికి ఇప్పటినుంచే అన్ని పార్టీలు ఏపీలో ఎన్నికలపై దృష్టిసారించాయి. ముందస్తు ఎన్నికలు రావొచ్చంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల కాలంలో పదేపదే చెబుతూ వస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని మరోవైపు వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. సీఏం జగన్మోహన్ రెడ్డి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించి, ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మినహా ఏడాదిన్నర లోపు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఓ వైపు పొత్తుల వ్యవహారం కూడా ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. వైసీపీ ఒంటరిగా పోటీచేస్తుందని ఆ పార్టీ నాయకులు సవాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించాలంటూ సవాలు విసురుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయనే చర్చ కూడా సాగుతోంది. మధ్యలో బీజేపీని కలుపుకోవాలని టీడీపీ చూస్తోంది. కాని ఎన్నికల సమయం సమీపించే వరకు వేచి చూడాలనే ధోరణిలో కమలం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల విశాఖపట్టణంలో జనసేన నాయకుల అరెస్టులు, పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసుల అడ్డంకులు విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో పవన్ కళ్యాణ్ ను కలిసి సానుభూతి తెలిపారు. ఇదే సమయంలో ఇద్దరు నాయకులు రాజకీయంశాలపై కూడా చర్చించనట్లు వార్తలొచ్చాయి. బహిరంగంగా ఇద్దరు నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవల్సిన అవసరం అన్ని పార్టీలపై ఉందని, వైసీపీ అరాచకాలపై అన్ని పార్టీలను కలుపుకుని పోరాడతామని తెలిపారు. అప్పటినుంచి టీడీపీ, జనసేన టార్గెట్ గా వైసీపీ విమర్శలు చేస్తోంది. రాహస్య స్నేహం బయటపడిందని, ఇద్దరూ ఒకటేనంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడమే టీడీపీ, జనసేన టార్గెట్ గా కనిపిస్తోంది. దీంటో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం పక్కా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే సమయంలో 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేయగా, జనసేన మద్దతు తెలిపింది.

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీని కలుపుకుని పోటీచేయాలనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ సమీకణాల బట్టి వైసీపీకి గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తోందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుండటంతో పాటు.. అక్కడ ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ ప్రతిపక్షాలు, వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని అధికార వైసీపీ పట్టుబట్టి కూర్చోవడంతో రాజకీయమంతా రాజధాని చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఉన్న ఒక ఫోటోను చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని, పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యిందంటూ.. నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన సందర్భంగా శిలాఫలకం వద్ద నరేంద్రమోదీతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం గ్రామంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అమరావతిలో సచివాలయం నిర్మాణంతో పాటు.. రహదారుల నిర్మాణాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, అందుకే వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నామని వైసీపీ చెప్పింది. కార్యనిర్వహక రాజధానిగా విశాఖపట్టణం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతిని అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. అయితే వీటిపై హైకోర్టులో స్టే రావడం, మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. అయినప్పటికి వికేంద్రీకరణ తమ విధానమని వైసీపీ చెప్తోంది. తెలుగుదేశం పార్టీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. రాజధాని అంశాన్ని ఎన్నికల్లో అజెండా చేయాలని టీడీపీ భావిస్తుండగా, అన్ని ప్రాంతాల అభివృద్ధిని వైసీపీ తన నినాదంగా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు తమ వ్యూహలకు పదును పెడుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..