Chandrababu Naidu: ఏపీలో ఎన్నికల కమిషన్ ఉందా.. చేతకాక పోతే వెళ్లిపోండి.. ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో వైసీపీ నేతలు ఖూనీ చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయి ధ్వజమెత్తారు.
Chandrababu Naidu: ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో వైసీపీ నేతలు ఖూనీ చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎన్నికల ను అపహాస్యం చేయడం చరిత్రలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. పోలీసులు సైతం దొంగలకు వంత పాడుతున్నారన్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ వలంటీర్లే దొంగ ఓటర్లని బూత్‌లకు తీసుకొస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు.
జగన్ అరాచకపాలన, పెరిగిన ధరలు, పెంచిన పన్నులు, అధ్వాన రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఎదురు తిరిగే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను.. రాజకీయాలు ఇంత అసహ్యంగా ఉంటాయా.. అనే పరిస్థితి తీసుకు వచ్చారని మండిపడ్డారు. బయట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కుప్పం వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తున్నవారిని పట్టుకుంటే టీడీపీ కార్యకర్తలనే అరెస్ట్ చేస్తున్నారన్న చంద్రబాబు.. ఎన్నికల కమిషన్ ఉందా.. చేతకాక పోతే వెళ్లిపోండి అంటూ ఘాటు స్పందించారు. ఎన్నికల సమయంలో పోలీసులు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.