Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: అమ్మ బాబోయ్.. తిరుమలలో కొత్త తరహా మోసం.. తస్మాత్ జాగ్రత్త

తిరుమల కొండపై తమిళనాడుకు చెందిన ఒక ఘరానా మోసగాడి వ్యవహారం వెలుగు చూసింది. మాంగళ్య పూజ పేరుతో మహిళలను టార్గెట్ చేసి ఘరానా మోసాలకు పారపడ్డ మురుగన్ అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ. 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

Tirumala: అమ్మ బాబోయ్.. తిరుమలలో కొత్త తరహా మోసం.. తస్మాత్ జాగ్రత్త
Murugan Nagaraj
Follow us
Raju M P R

| Edited By: Ram Naramaneni

Updated on: May 02, 2025 | 8:59 AM

తిరుమలలో భక్తులను బురిడీ కొట్టించిన మాయగాడి లీలలు బయటకొచ్చాయి. తమిళనాడులోని మధురైకి చెందిన మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావు గత కొద్ది రోజులుగా కొండపై మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్‌ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు.. తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళా భక్తులను మాంగళ్య పూజతో మోసం చేసినట్లు తేల్చారు. టీటీడీ ఉద్యోగిని అంటూ తిరుమల ఆలయ పరిసరాల్లోనే తిరుగుతూ భక్తులకు మాయ మాటలతో నమ్మించి మోసాలకు పాల్పడ్డాడు. భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటుందని ఆలయం ముందు మాంగళ్య పూజ చేయాలని మాయమాటలతో మురుగన్ నాగరాజ్ వారిని మోసగించాడు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి అఖిలాండం వద్ద ఉన్న తమిళనాడు తిరువన్నామలై ప్రాంతానికి చెందిన ఉచిమహాలీ అనే మహిళతో తొలుత మాటలు కలిపాడు. తర్వాత తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకొన్నాడు. తిరుమల వైభవాన్ని చెబుతూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాంగళ్య పూజ చేస్తే భర్తకు, కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మబలికాడు. అనంతరం బీడీ ఆంజనేయస్వామి ఆలయ లోని మినీ షాపింగ్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లి ఆమెకు రెండు డజన్ల మట్టిగాజులు ఇచ్చి ఆమె వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు మాంగళ్య సూత్రం, లక్ష్మీ డాలర్ చైన్, రెండు సెల్ ఫోన్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను శ్రీవారి పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

మార్చి 14 న కూడా ఇలాంటి మోసానికే తెర తీశాడు. కోయంబత్తూరుకు చెందిన శరణ్యకు మాంగళ్య పూజ చేస్తానంటూ ఆమె వద్ద 80 గ్రాముల బంగారు కాజేసాడు మురుగన్. టీటీడీ విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి శరణ్యను మాంగళ్య పూజ ముగ్గులోకి దింపాడు. ఆమె వద్ద ఉన్న బంగారు గాజులు, మంగళసూత్రం, లక్ష్మీ డాలర్ చైను తీసుకుని పుష్కరిణిలో స్నానం చేసి మాంగళ్య పూజ కోసం ఆలయం వద్దకు రావాలన్నాడు మురుగన్. స్నానం చేసి శరణ్య అక్కడికి వచ్చేలోపు ఆలయం వద్ద పత్తా లేకుండా పోయాడు మురుగన్.

ఇక మార్చి 18 న తిరువల్లూరు జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మహిళను కూడా ఇదే తరహాలో మోసం చేసి ఆమె వద్ద ఉన్న 12 గ్రాముల బంగారు గొలుసును తీసుకొని మాయమయ్యాడు. మార్చి 14న, 29న, ఏప్రిల్ 18 న ముగ్గురు మహిళలను మాంగళ్య పూజ పేరుతో మోసం చేసి 3 కేసుల్లో నిందితుడిగా ఉన్న మురుగన్‌ను అరెస్ట్ చేసిన పోలీసుకు రిమాండ్ కు తరలించారు.

గత 35 ఏళ్లుగా ఇలాంటి నేరాలకే పాల్పడుతూ తరచూ జైలుకు వెళ్లి వస్తున్న మురుగన్ నేరచరిత్ర పై ఆరా తీసిన పోలీసులు జల్సాల కోసమే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మురుగన్‌పై ఏపీ, తమిళనాడులో సుమారు 20కి పైగా కేసులు ఉన్నట్లు విచారణలో తేల్చారు. నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఉన్నట్లు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..