AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ‘సర్కారు వారి పాట’.. అక్కడ కిలో ఉల్లి రూ. 25కే.. క్యూ కట్టిన జనాలు..

Onion Prices In AP: ఉల్లిపాయ ధరలు ఘాటెక్కాయి. కొనాలంటే కన్నీరు తెప్పిస్తున్నాయి. రోజురోజుకీ ధరలు పెరిగిపోతున్నాయి. 60 రూపాయలు పెట్టనిదే మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు రావడం లేదు. ఈ సమయంలో కేవలం 25 రూపాయలకే కిలో ఉల్లిపాయ ఇస్తుంటే.. ఎవరైనా ఊరుకుంటారా..? జనాలు ఆ షాపునకు క్యూ కడుతున్నారు. క్యూలైన్‌లో నిల్చుని మరి ఉల్లిపాయలను సొంతం చేసుకుంటున్నారు.

ఏపీలో 'సర్కారు వారి పాట'.. అక్కడ కిలో ఉల్లి రూ. 25కే.. క్యూ కట్టిన జనాలు..
Onions
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Nov 09, 2023 | 5:43 PM

Share

Onion Prices In AP: ఉల్లిపాయ ధరలు ఘాటెక్కాయి. కొనాలంటే కన్నీరు తెప్పిస్తున్నాయి. రోజురోజుకీ ధరలు పెరిగిపోతున్నాయి. 60 రూపాయలు పెట్టనిదే మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు రావడం లేదు. ఈ సమయంలో కేవలం 25 రూపాయలకే కిలో ఉల్లిపాయ ఇస్తుంటే.. ఎవరైనా ఊరుకుంటారా..? జనాలు ఆ షాపునకు క్యూ కడుతున్నారు. క్యూలైన్‌లో నిల్చుని మరి ఉల్లిపాయలను సొంతం చేసుకుంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడనుకుంటున్నారా.? ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో..

వివరాల్లోకి వెళ్తే.. ఉల్లి కొరత, ధరల పెరుగుదల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో రాయితీపై ఉల్లిపాయలను పంపిణీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నంలోని నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NCCF) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ రాయితీ ఉల్లిని సరఫరా చేస్తుండగా.. విశాఖలో ఎన్‌సీసీఎఫ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉల్లిపాయలు పంపిణీకి భారీ డిమాండ్ ఏర్పడింది. 25 రూపాయల కిలో చొప్పున ఉల్లిపాయలను పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున ఇస్తున్నారు. దీంతో సబ్సిడీ ఉల్లిపాయ కొనేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

ఉల్లి కోసం అలా తప్పదట..!

ప్రతీ రోజూ ఉదయం అయితే చాలు.. సబ్సిడీ ఉల్లి కోసం క్యూ కడుతున్నారు. మహిళలు, వృద్ధులు కూడా క్యూలైన్లో వేచి చూస్తున్నారు. కిలో 60 రూపాయలు ఇచ్చి కొనే కంటే.. 25 రూపాయలకి వస్తున్నందుకు ఆమాత్రం కష్టం తప్పదు అంటున్నారు వినియోగదారులు. కేంద్రం నుంచి.. సప్లై ఉన్నంతవరకు.. రాయితీపై ఉల్లిపాయలను కిలో 25 రూపాయలకే పంపిణీ చేస్తామన్నారు విశాఖ ఎన్‌సీసీఎఫ్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ హర్ష. మొత్తం మీద కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరతో విలవిలలాడుతోన్న జనాలకు రాయితీపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీ ఉల్లి కాస్త ఊరటనిస్తోంది.