Andhra: చలిమంటలతో జాగ్రత్త.. నిద్రలోకి జారితే అంతే..!
చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోంది. చలిమంటలు, కుంపట్లే కొందరి ఆయువు తీస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో చలి నుంచి ఉపశమనం కోసం మంట పెట్టుకున్న వృద్ధురాలు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. .. .. ..

రోజురోజుకు పెరుగుతున్న చలి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్ లో నమోదవుతున్నాయి. ఉదయం 10 దాటుతున్నా మంచు తెరలు విడడం లేదు. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎముకల కొరకే చలిలో యువకులే చలికి వణికి పోతూ ఉన్నారు. మరి చిన్నపిల్లలు వృద్ధుల పరిస్థితి అయితే.. మాములుగా లేదు. ఈ క్రమంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు కొంతమంది చలిమంటలు వేసుకుంటుంటే.. మరికొంతమంది రాత్రిపూట చలిని తట్టుకునేందుకు వృద్ధులు కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇవే ఇప్పుడు వారి ఆయువు తీస్తున్నాయి. అగ్ని ప్రమాదాలకు గురై ప్రాణాలు తోడేస్తున్నాయి.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన ఘటనలో వృద్ధురాలు సజీవ దహనం అయ్యారు. పూరిపాకలో జీవనం సాగిస్తున్న 80ఏళ్ల వంకల మాణిక్యం.. గతరాత్రి పడుకుంది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంట పెట్టుకుంది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. ఆ మంటలు క్రమంగా వ్యాపించాయి. పూరిపాకకు ఆ నిప్పు అంటుకోవడంతో.. పూర్తిగా కాలిపోయింది. నిద్రలో ఉన్న మాణిక్యం తప్పించుకునే అవకాశం లేక మంటల్లో సజీవ దహనం అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చలికాలంలో ఇళ్లలో మంటలు, కుంపట్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
