Anakapalle: కోళ్ల ఫారం చుట్టూ వేసిన వల నుంచి అదే పనిగా చప్పుళ్లు – ఏంటా అని వెళ్లి చూడగా
అది ఏడడుగుల పైగా పొడవున్న భారీ నాగజెర్రి..! పక్షులు, కోళ్ల పెంపకం కోసం ఏర్పాటుచేసిన షెడ్డు చుట్టూ ఏర్పాటు చేసిన వలలో శరీరం అంతా వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పని అయింది ఆ పాముకు. దీంతో పామును వలనుంచి చాకచక్యంగా బయటకు తీసిన ఆ వ్యక్తి.. పాముకు సపర్యలు చేశాడు. కాస్త ఆలస్యమైనా పాపం ఆ పాము ప్రాణాలు కోల్పోయేది.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలంలో ఒక షెడ్డు వేశాడు. అందులో కోళ్ల పెంపకానికి సిద్ధమయ్యాడు. షెడ్డు చుట్టూ ఇతర జంతువులు పక్షులు చొరబడకుండా వలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏమైందో ఏమో కానీ.. శనివారం షెడ్డుకు వెళ్లిన ఆ రైతుకు ఆ వల దగ్గర నుంచి చప్పుళ్లు వినిపించాయి. ఏంటా అని వెతికారు.. చివరకు అక్కడ ఉన్నది చూసి షాక్ కూడా అయ్యారు. భారీ నాగ జెర్రి ఆ వలలో చిక్కుకుంది. ఆ పామును జెర్రిపోతు లేదా జెర్రిగొడ్డు అని పిలుస్తారు. వల నుంచి బయటకు రాలేక నిరసించిపోయింది. అయినప్పటికీ దగ్గరకు వెళ్తే.. భయపడి బుసలు కొడతొంది. దీంతో భయాందోళనకు గురైన రైతు.. స్నేక్ క్యాచర్ కిరణ్‌కు కాల్ చేశారు. హుటాహుటిన అక్కడకు వెళ్లి.. చూసేసరికి అప్పటికే పాము నిరసించి పోయినట్టు గుర్తించారు. ఒకవైపు నీరసించినప్పటికీ.. కసితో కోపంలో కనిపిస్తోంది.
ఒక్కో వైరును కత్తిరించి.. పామును రక్షించి..
నాగజెర్రి శరీరమంతా వలకు చెందిన వైర్లతో పూర్తిగా చుట్టుకుని ఉంది. దీంతో అన్ని వైర్లు తొలగించేసరికి దాదాపుగా 20 నిమిషాల సమయం పట్టింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని.. ఎట్టకేలకు వలను కత్తిరించి ఆ పామును బయటకు తీశాడు కిరణ్ కుమార్. నాగ జెర్రికి సపర్యలు చేశారు.
వలలో చిక్కుకున్న నాగ జెర్రిని చూసి జాలి వేసినా… అది కాటేస్తుందేమో అని భయపడ్డారు. కానీ అది విషరహిత పాము అని స్నేక్ క్యాచర్ తెలిపారు. ఆ పామును అత్యంత చాకచక్యంగా వల నుంచి బయటకు తీశాడు. ప్రాణం పోయేంత స్థితిలో ఉన్న ఆ పామును వల నుంచి వేరు చేసి ఊపిరి పోసాడు. గతంలోనూ భీమిలి, స్టీల్ ప్లాంట్ ప్రాంతాల్లో చేపల వలలో చిక్కుకుని తీవ్ర గాయాల పాలైన కొండచిలువ, గోధుమ నాగు పాములను బయటకు తీసి.. పశు వైద్యుడు దగ్గరకు వాటిని తీసుకెళ్లి కుట్లు వేయించి వైద్యం చేయించి.. కోలుకున్నాడు అడవిలో వదిలేశాడు కిరణ్ కుమార్.
మనిషికి ఆపద ఎదురైతే నోరు విప్పి చెప్పుకుంటారు… కానీ ఇటువంటి మూగజీవాల పరిస్థితి ఏంటి..? చిక్కి శల్యమై ప్రాణాలు విడవడమే..! అటువంటి పరిస్థితుల్లో దానికి సపర్యాలు చేసి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించిన ఆ జంతు ప్రేమికుడికి సలాం చేయాల్సిందే..!
పాము రెస్క్యూ వీడియో దిగువన చూడండి….
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




