Bhimavaram: భీమవరం మావుళ్లమ్మ మూలవిరాట్ దర్శనం 11 రోజులు నిలిపివేత
భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి మూలవిరాట్ దర్శనం ఈ నెల 17 నుంచి 28 వరకు తాత్కాలికంగా నిలిపివేశారు. సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా గర్భాలయంలో శుద్ధి, అలంకరణ కార్యక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 29న ఉదయం 10.30 గంటలకు కళాన్యాసం అనంతరం అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

మావుళ్లమ్మ చల్లని తల్లి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు. నిత్యం ఒంటినిండా బంగారు నగలతో పసిడి కాంతులతో మెరిసిపోతూ ఉంటారు అమ్మవారు. రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అటువంటి అమ్మవారి మూలవిరాట్ దర్శనానికి ప్రతి సంవత్సరం పదకొండు రోజుల పాటు నిలిపివేస్తారు ఆలయ అధికారులు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి మూలవిరాట్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేసారు. మావుళ్లమ్మ అమ్మవారి సంక్రాంతి మహోత్సవముల సందర్భంగా గర్భాలయంలో శుద్ధి కార్యక్రమాలు, అమ్మవారి అలంకరణ పనుల నిమిత్తం పదకొండు రోజుల పాటు మూలవిరాట్ దర్శనాన్ని ఆలయ అధికారులు తాత్కాలికంగా ఆపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 17 నుంచి 28 వరకూ గర్భాలయం మూసివేస్తారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, వేదపండితులు ఆధ్వర్యంలో వేద మంత్రోశ్చరణలు, విశేష హోమాలు నిర్వహించి కళాపకర్షణ పూజ జరిపి అమ్మవారి దర్శనాలు నిలుపుదలచేసారు. తిరిగి ఈ నెల 29 సోమవారం ఉదయం 10.30 గంటలకు కళాన్యాసము జరిపి అమ్మవారి మూలవిరాట్ పునఃదర్శనం కల్పించనున్నారు. అయితే అమ్మవారి ప్రదక్షణ మండపంలో గర్భాలయం వెనుక ఏర్పాటు ఉత్సవ మూర్తికి పూజలు యధావిధిగా జరుగుతాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ . సంక్రాంతి పండుగ భోగి మొదలు నెల రోజుల మావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు తెలుగు రాష్టాల నుండే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, ఇతర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు. మావుళ్లమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



