Andhra Pradesh: దర్శనం నుంచి ప్రసాదం వరకు.. ఇంద్రకీలాద్రిపై అంతా ఆన్‌లైన్ పేమెంట్సే…
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో దర్శనం, అన్ని సేవలు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్, డిజిటల్ విధానంలో అందుబాటులోకి వచ్చాయి. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. భక్తులు దర్శన టిక్కెట్లు, అర్జిత సేవలు, ప్రసాదాలు ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. అక్రమాలను అరికట్టేందుకు, పారదర్శక చెల్లింపులకు ఈ మార్పులు దోహదపడతాయి.

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తుల కోసం కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.. ఇకపై దర్శనం టికెట్లు సహా ఆలయంలోని అన్ని సేవలు పూర్తిగా ఆన్‌లైన్, డిజిటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు దేవస్థానంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలను ఎండోమెంట్ అధికారులు చేపట్టారు. ఇక నుంచి ఏ సేవలైనా డిజిటల్ చెల్లింపులే చేయాల్సి ఉంటుంది. దర్శన టికెట్లు, ప్రత్యక్ష, పరోక్ష అర్జిత సేవలు, ప్రసాదాల కొనుగోలు, వసతి గదులు, కేశఖండన టికెట్లు విరాళాలు ఇలా మొత్తం డిజిటల్ పద్ధతుల్లోనే చెల్లింపులు చేయాలి. ఈ నేపథ్యంలో భక్తులు గమనించాలని ఆలయ ఈవో సీనా నాయక్ విజ్ఞప్తిని చేస్తున్నారు.
ఏపీలోని ప్రధాన దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించింది. దీంతో ఆన్లైన్ లావాదేవీలు జరిగిన ఆలయాలకు ర్యాంకులు ఇస్తున్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తొలి స్థానంలో ఉండగా.. విజయవాడ దుర్గ గుడి రెండో స్థానంలో ఉంది. దుర్గగుడిలో ఆన్‌లైన్ ద్వారా దర్శన టికెట్లు విక్రయాలు జరగగా.. ఒక్క రోజే 947 టికెట్లు ఆన్‌లైన్‌లో జరిగాయి. అయితే పలువురు భక్తులు టికెట్ బుకింగ్ విధానంపై సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. భక్తులు చాలా సులభంగా రెండు అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్, వాట్సప్ నెంబర్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆలయ ఈవో సేన నాయక్ తెలిపారు.
ఇకపై భౌతికంగా అధిక టికెట్లు విక్రయించే పద్ధతికి పూర్తిగా ముగింపు పలకనున్నారు. టికెట్ల విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలకు డిజిటల్ విధానం చెక్ పెట్టనుంది. భక్తులు తమకు అనుకూలమైన విధానంలో చెల్లింపులు చేసుకునేలా అన్ని డిజిటల్ పేమెంట్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



