Tirumala: ఇక టీటీడీ బ్లేడ్లు కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా..?
హైదరాబాద్‌కు చెందిన వెర్టైస్ సంస్థ తిరుమల శ్రీవారి భక్తుల తలనీలాల సమర్పణకు రూ.1.2 కోట్ల విలువైన బ్లేడ్లను టీటీడీకి విరాళంగా అందజేసింది. ఈ మెగా విరాళం ద్వారా టీటీడీకి ఏటా రూ.1.16 కోట్లు ఆదా అవుతాయి. అధిక నాణ్యత గల ఈ బ్లేడ్‌లు భక్తులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తాయి.

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు మొక్కుల రూపంలో తలనీలాలు సమర్పించుకోవడం ఆచారం. ఈ ప్రక్రియలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. టీటీడీ కల్యాణకట్టలో భక్తుల తలనీలాలు తీసేందుకు అవసరమైన బ్లేడ్లను విరాళంగా అందజేసింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బ్లేడ్ల తయారీ సంస్థ వెర్టైస్ ఈ మెగా విరాళాన్ని అందజేసింది. సుమారు రూ. 1.20 కోట్ల విలువైన ‘సిల్వర్ మ్యాక్స్’ హాఫ్ బ్లేడ్లను ఆ సంస్థ డైరెక్టర్ బొడ్డుపల్లి శ్రీధర్.. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు.
తిరుమల కల్యాణకట్టలో రోజుకు దాదాపు 40 వేల బ్లేడ్లను వినియోగిస్తారు. వీటి కొనుగోలు కోసం టీటీడీ ఏటా రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు ఈ విరాళం వల్ల ఆ మొత్తాన్ని టీటీడీ ఆదా చేయగలుగుతుంది. ఈ బ్లేడ్లు అమెరికా, యూరప్ వంటి దేశాల్లో వాడే నాణ్యతతో ఉంటాయని, క్షురకులకు ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయని దాత తెలిపారు. స్వామివారి భక్తులకు సేవ చేసే అవకాశం రావడం తమ అదృష్టమని సంస్థ నిర్వహకులు ఆనందం వ్యక్తం చేశారు.వెర్టైస్ సంస్థకు రోజుకు 50 లక్షల బ్లేడ్లను తయారు చేసే సామర్థ్యం ఉందని, గత పదేళ్లుగా ఈ రంగంలో ఉన్నామని వారు తెలిపారు. తిరుమల క్యాంప్ కార్యాలయంలో విరాళం అందుకున్న బి.ఆర్. నాయుడు.. దాత శ్రీధర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



