Tanguturu: సెక్యూరిటీ గార్డును కత్తులు, గొడ్డళ్లలతో నరికి చంపాల్సిన అవసరం ఏంటి..?
ప్రయివేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసింది ఎవరు... చోరీ కోసం వచ్చి ప్రతిఘటిస్తే హతమార్చారా... లేక ఆయనతో ఎవరికైనా పాతకక్షలు ఉన్నాయా... ఒంటరిగా ఉన్న ఆ సెక్యూరిటీ గార్డును కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది... రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చిన ఈ దారుణ హత్య ఘటనలో ప్రకాశం జిల్లా పోలీసుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే... ఇంతకీ ఏం జరిగింది.

ప్రకాశం జిల్లా టంగుటూరులోని పాతవడ్డిపాలెంలో దారుణం చోటు చేసుకుంది… స్థానికంగా హెడ్‌డిఎఫ్‌సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్న 55 ఏళ్ల వెంకటరమణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ఈనెల 16వ తేది రాత్రి జరిగినట్టు భావిస్తున్న ఈ దారుణ హత్య రెండురోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న టంగుటూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆరేళ్లుగా ఒంటరి నివాసం…
టంగుటూరుకు చెందిన వెంకటరమణయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగరీత్యా అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో టంగుటూరులోని పాతవడ్డిపాలెంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు వెంకటరమణయ్య… కొడుకు అప్పుడప్పుడూ ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకుంటుంటాడు… ఈ నేపధ్యంలో ఈనెల 17వ రాత్రి వెంకటరమణయ్యకు కొడుకు ఫోన్ చేశాడు… ఫోన్ మోగుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు… మళ్లీ 18వ తేది ఉదయం ఉంచి వరుసగా ఫోన్ చేస్తున్నా తండ్రి లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి గ్రామంలోని తన స్నేహితులకు ఫోన్ చేసి ఒకసారి చూసిరమ్మని పంపించాడు… తీరా వచ్చి చూస్తే వెంకటరమణయ్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు… వెంకటరమణ తల, గొంతుపై కత్తి గాయాలను గుర్తించి హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు.
మిస్టరీగా మారిన హత్య…
ఒంటరిగా ఉంటున్న 55 ఏళ్ల వెంకటరమణయ్యను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలియకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. ఇంట్లో చోరీ కోసం వచ్చిన దొంగలు స్వతహాగా సెక్యూరిటీ గార్డైన వెంకటరమణయ్య ప్రతిఘటించడంతో హత్య చేశారా… లేక పాతకక్షలు ఏమైనా ఉన్నాయా… అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు… వెంకటరమణయ్య తల, మెడపై పదునైన కత్తి గాయాలతో పాటు తలపై బలమైన గొడ్డలిలాంటి ఆయుధంతో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు… డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు… ఎఫ్‌ఎస్‌ఎల్ టీంలను కూడా రప్పించి హంతకుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు… అలాగే దగ్గర్లోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు… నాలుగు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే ఈ హత్య కేసును ఛేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



