Andhra Pradesh: బాలికపై లైంగిక దాడి కేసులో సినిమా ట్విస్ట్‌లు… అసలేం జరిగిందంటే..

ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె తల్లిదండ్రులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ నేతలను పోలీసులు అనుమతించలేదు... దీంతో పోలీసులతో వైసిపి నేతలు వాగ్వివాదానికి దిగారు..

Andhra Pradesh: బాలికపై లైంగిక దాడి కేసులో సినిమా ట్విస్ట్‌లు... అసలేం జరిగిందంటే..
Shocking Twists
Follow us
Fairoz Baig

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 09, 2024 | 7:51 PM

ప్రకాశంజిల్లాలోని ఓ జడ్‌పి హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై ఓ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు… మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధిత బాలిక స్పష్టంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వని కారణంగా కేసు నమోదులో జాప్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు… ఈరోజు బాలిక నుంచి తాజాగా తీసుకున్న స్టేట్‌మెంట్‌ ప్రకారం స్కూల్లోని ఓ టీచర్‌ తనపై లైంగిక దాడి చేసినట్టు బాలిక చెప్పడంతో కేసు నమోదు చేసి నిందితుడైన టీచర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు… బాలికపై టీచర్‌ లైంగిక దాడి వ్యవహారం అలజడి సృష్టించే అవకాశం ఉండటంతో ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు… ఈ ఘటనపై పోలీసుల తీరును వైసిపి నేతలు, ప్రజా సంఘాల నేతలు తప్పుబడుతున్నారు…

సంచలన కేసులోనూ తాత్సారం…

ప్రకాశంజిల్లాలో సంచలనం సృష్టించిన నాలుగో తరగతి విద్యార్ధినిపై లైంగిక దాడి విషయంలో మూడురోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు… మూడు రోజుల క్రితం స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించింది… దీంతో స్కూల్లో తన స్నేహితురాలు ఓ టీచర్‌ పిలుస్తున్నాడని తీసుకెళ్ళిందని, అక్కడ ఆ టీచర్‌ తన రహస్యాంగాలపై లైంగికంగా దాడి చేశాడని తల్లికి చెప్పడంతో బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు… అయితే డాక్టర్లు బాలికను పరీక్షించిన తరువాత తనపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందన్నది పోలీసులు విచారిస్తుండగా స్పష్టంగా చెప్పలేకపోయిందన్న కారణంగా ఆరోజు పోలీసులు కేసు నమోదు చేయలేదు… బాలిక భయపడుతుందన్న కారణంగా రెండో రోజు కూడా బాలిక స్టేట్‌మెంట్‌ తీసుకున్నా క్లారిటీ లేదన్న కారణంగా నిన్నటి వరకు విచారణ ముందుకు సాగలేదు.

ఇవి కూడా చదవండి

విద్యాశాఖ విచారణ…

మరోవైపు విద్యార్ధినికి బ్లీడింగ్‌ కావడంతో బుధవారం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధిని వ్యవహారంలో పోలీసులు ఇంకా క్లారిటీ రాలేదన్న కారణంగా తాత్సారం చేస్తుండగా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు… రాత్రి నుంచి టీచర్‌ నిర్వాకంపై పోలీసులకు తెలిపినా విషయం పెద్దది చేసుకుంటే మీకే ప్రమాదం అంటూ ఓ మహిళా కానిస్టేబుల్‌ భయపెట్టిందంటూ బాలిక తల్లి ఆరోపిస్తుండగా, కేసు ఇంకా విచారణ దశలోనే ఉందంటున్నారు పోలీసులు. ఇటు హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్దులను… అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను విద్యాశాఖ అధికారులు విచారించారు… ఈ సందర్భంగా తన స్కూలు మేట్‌గా ఉన్న తన స్నేహితురాలు టీచర్‌ పిలుస్తున్నాడంటూ తీసుకెళ్ళిందని, అక్కడ టీచర్‌ తన రహస్యాంగాల దగ్గర చెప్పుకోలేని విధంగా వేళ్ళతో గట్టిగా తాకాడాని బాలిక విద్యాశాఖ అధికారులకు చెప్పినట్టు బాలిక తల్లి స్పష్టం చేస్తున్నారు… అందుకే బ్లీడింగ్‌ అయిందని తెలిపారు… ఆసుపత్రిలో తమకు రక్షణ కల్పించేందుకు ఒచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఈ వ్యవహారంలో పెద్ద వాళ్ళు ఉన్నారు… వాళ్ళ గురించి చెబితే మీకే ప్రమాదం అంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు… తమ బిడ్డకు జరిగిన విధంగా మరో బిడ్డకు జరగకూడదన్న ఉద్దేశ్యంతో ఏం జరిగిందో బహిరంగంగా చెబుతున్నామని బాలిక తల్లి, బంధువులు చెబుతున్నారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని నమోదు చేసుకున్నారని చెబుతున్నారు.

గురువారం వెలుగులోకి వచ్చిన విద్యార్ధినిపై టీచర్‌ లైంగిక దాడి వ్యవహారం స్కూల్లో జరిగినందున విద్యాశాఖ అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు… డిప్యూటీ డిఇఓ చంద్రమౌళి, సర్వశిక్షా అభియాన్‌ అదికారి మాధవి లత హైస్కూల్లో ఈరోజు ఉపాధ్యాయులను, విద్యార్దులను విచారించారు… అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను అడిగి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు… తనపై లైంగిక దాడి చేసిన టీచర్‌ ఫోటోను బాలిక గుర్తుపట్టినట్టు బాలిక బందువులు చెబుతున్నారు…

పరామర్శించేందుకు వచ్చిన వైసిపి నేతల్ని అడ్డుకున్న పోలీసులు…

మరోవైపు ప్రకాశంజిల్లాలోని ఓ జడ్‌పి హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై ఓ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల పై బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌, వైసిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు… దీంతో ఒంగోలు రిమ్స్‌ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది… దీంతో బాలికపై లైంగిక దాడి వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది… ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె తల్లిదండ్రులను పరామర్శించేందుకు వచ్చిన మాజీమంత్రి ఆదిమూలపు సురేష్, వైసీపీ నేతలు వరికూటి అశోక్ బాబు, మాదాసి వెంకయ్యలను పోలీసులు అనుమతించలేదు… దీంతో పోలీసులతో వైసిపి నేతలు వాగ్వివాదానికి దిగారు… బాలికపై లైంగిక వేధింపులు జరిగి మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు కేసు నమోదు చేయడం చేయకపోవడంపై వైసీపీ నేతలు పోలీసులను ప్రశ్నించారు… కేసు కట్టకుండా బాలికను పోలీసుల సంరక్షణలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఎలా ఉంచుతారంటూ నేలపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, కొండపి వైసిపి మాజీ ఇన్ఛార్జి మాదాసి వెంకయ్యలు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు… వైసిపినేతలతో పాటు, ఐద్వా మహిళా సంఘాల నేతలు, దళిత సంఘాల నేత నీలం నాగేంద్ర రిమ్స్‌ దగ్గరకు చేరుకుని పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు.

అందుకే ఆలస్యం…

అయితే పోలీసులు మాత్రం బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు ముందురోజు ఒక స్టేట్‌మెంట్‌, మరుసటి రోజు మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, వాస్తవాలు విచారించి తెలుసుకున్న తరువాత కేసు కట్టేందుకు ప్రయత్నించామని ఎఫ్‌ఐఆర్‌ కట్టే విషయంలో జరిగిన జాప్యాన్ని సమర్ధించుకుంటున్నారు… తాజాగా బాలిక తల్లి దగ్గర తీసుకున్న స్టేట్‌మెంట్‌ ప్రకారం ఈరోజు కేసు కడుతున్నామని తెలిపారు… నిందితుడు ఎవరైందీ గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాస్‌ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..