Andhra Pradesh: ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు.. కారణమిదే
ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది
ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు ఎన్నికలతో సంబంధంలేని విధులు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త వారిని నియమించాలని ఆదేశించింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు పంపారు. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర జరిగింది. ఈయాత్రలో జగన్‌పై రాయి దాడి చేశారు. సీఎం జగన్‌పై రాయి దాడి కేసు సీరియస్ గా తీసుకోవడమే కాకుండా, ప్రతిపక్షాల నుంచి వీరిద్దరిపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసీ బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు IPSలను ఈసీ ఉన్నఫలంగా బదిలీ చేయడంపై పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. ఇంతకుముందు ముగ్గురు IASలు, ఆరుగురు IPSలపై బదిలీ వేటు వేసింది ఈసీ. అనంతపురం, కృష్ణా, తిరుపతి కలెక్టర్ల మీద ఈసీ బదిలీ వేటు వేసింది. అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు, తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షాలను బదిలీ చేసింది. అలాగే ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలపైనా కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్‌ను కూడా విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిని ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేసింది. పల్నాడు జిల్లాలో ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో తలెత్తిన సెక్యూరిటీ లోపాలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ప్రకాశం, అనంతపురంలో జరిగిన దాడి ఘటన విషయంలో అక్కడ ఎస్పీలపై బదిలీ వేటు వేసింది ఈసీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..