Vizag: కడలి గర్భంలో మువ్వన్నెల పతాకం రెపరెపలు..
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ సాగర గర్భంలో స్కూబా డైవర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేవీ మాజీ అధికారి, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో 77 అడుగుల లోతులో మువ్వన్నెల జెండాను ప్రదర్శించి దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. ..

దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. వేడుకలతో భారతజాతి పులకించిపోయింది. ఇంతటి మహత్తర రోజున.. విశాఖ సాగరంలో మరో అరుదైన దృశ్యం కనువిందు చేసింది. సాగర గర్భంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు స్కూబా డైవర్లు. నీటి అడుగున జెండా చేత పట్టుకుని గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు ఇద్దరు స్కూబా డ్రైవర్లు ప్రదర్శన చేసి ఔరా అనిపించారు.
విశాఖలో స్కూబా డ్రైవర్లు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. మువ్వన్నెల జెండాను సముద్ర గర్భంలో ఆవిష్కరించారు. 77 ఏళ్ల గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. 77 అడుగుల లోతు సముద్ర గర్భంలో జాతీయ జెండా నీటిలో రెపరెపలాడింది. నేవి మాజీ అధికారి, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో అయిదుగురు సభ్యుల బృందం ఈ ఘనతను సాధించారు.
రుషికొండ తీరం నుంచి కొద్ది దూరం బోటులో.. వెళ్లి సముద్రంలో డైవ్ చేసి దేశభక్తిని చాటారు. దాదాపు అరగంట పాటు సముద్రంలోనే జాతీయ జెండాతో ఉన్నారు. ఇద్దరు స్కూల్ డ్రైవర్లలో ఒకరు.. గుర్రంలా, మరొకరు జాతీయ జెండా చేత పట్టుకొని ఆ గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు అద్భుత ప్రదర్శన చేశారు. ధైర్యం క్రమశిక్షణ రాజ్యాంగం పట్ల గౌరవాన్ని సూచిస్తూ జాతీయ జెండాతో ఈ ప్రదర్శన చేశామని అంటున్నారు బలరాం నాయుడు. ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందని.. సముద్రంలో అరగంట పాటు జాతీయ జెండా ప్రదర్శించామని బలరామ్ నాయుడు వివరించారు. జాతీయ జెండాను తీసుకెళ్లడం సముద్రంలో 77 అడుగుల లోతులో ఆవిష్కరించడం తో పాటు.. అక్కడ వరకు స్కూబా డైవింగ్ కిట్లతో వెళ్లి.. ఈ అద్భుత ఘట్టాన్ని కెమెరాలో షూట్ చేయడం మరో విశేషం.
