జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్ స్కామ్ బట్టబయలు!
దేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో యువత ప్రముఖ IIT, NITల్లో సీటు దక్కించుకోవడానికి ఎంతో కఠినమైన జేఈఈ పరీక్ష క్రాక్ చేసి.. పోటీలో ముందు వరుసలో నిలిచి ప్రవేశాలు పొందుతున్నారు. అయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత విద్మార్ధులకు అత్యంత తక్కువ ప్యాకేజీతో క్యాంపస్ సెలక్షన్స్ కు ఎంపిక చేస్తున్నారు. తాజా ప్లేస్‌మెంట్ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ ఆయా విద్యా సంస్థలు మాత్రం బడా ప్యాకేజీ అంటూ బయట ఊదరగొడుతున్నారని Careers360 CEO మహేశ్వర్ పెరి బహిరంగంగా వెల్లడించారు..

దేశంలో యేటా జరుగుతున్న ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్ ఫలితాలపై షాకింగ్ విషయాలను Careers360 వ్యవస్థాపకుడు, CEO మహేశ్వర్ పెరి బహిరంగంగా వెల్లడించారు. ఎక్స్ ఖాతాలో ఆయన ఆదివారం (జనవరి 25) పోస్టు చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థలలో ఒకటైన NIT కాలికట్‌లో తక్కువ ఎంట్రీ-లెవల్ జీతాలు వస్తున్నట్లు ఈ వీడియోలో పెరి బహిరంగంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా JEE అభ్యర్థులలో టాప్ 5 పర్సంటైల్‌లో ర్యాంక్ పొందిన అభ్యర్థులను ఈ ప్రోగ్రామ్‌లు చేర్చుకున్నప్పటికీ, NIT కాలికట్‌లో BTech (మెకానికల్) విద్యార్థులకు ఏడాదికి కేవలం రూ. 3 లక్షలు, BArch గ్రాడ్యుయేట్లకు రూ. 2.75 లక్షల ఫ్లోర్ జీతాలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయని పెరి వెల్లడించారు .
తాను చూసిన డేటా తనను తీవ్రంగా కదిలించి వేసిందని వీడియోలో పెరి పేర్కొన్నారు. యేటా దేశంలోని దిగ్గజ కాలేజీలు ప్లేస్‌మెట్‌లలో తమ విద్యార్ధులు అత్యధిక, మధ్యస్థ, సగటున టాప్ 10% శాలరీ ప్యాకేజీలతో బడా కంపెనీల్లో సెలెక్ట్ అవుతున్నట్లు హైలైట్ చేస్తున్నప్పటికీ.. అసలు రహస్యం మాత్రం వెలుగులోకి రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెట్లలో విద్యార్థులను అత్యల్ప జీతంతో ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన NIT కాలికట్ ప్లేస్‌మెంట్ డేటా ఈ విషయం వెల్లడించిందని అన్నారు. విద్యార్థుల ప్రతిభకు,ఆర్థిక ప్రతిఫలానికి మధ్య దిగ్భ్రాంతికరమైన అసమానతలు ఉన్నట్లు ఈ డేటా వెల్లడించిందన్నారు.
‘మన అత్యుత్తమ విద్యార్థులు దీనికి అర్హులేనా?’
NIT కాలికట్‌లో సీటు పొందాలంటే విద్యార్థులు దేశవ్యాప్తంగా JEE అభ్యర్థులలో టాప్ 2 నుంచి 5 పర్సంటైల్‌లో ర్యాంక్ పొందాలి. అయితే ఈ అత్యున్నత ప్రతిభకు మార్కెట్ స్పందన అంతకంతకూ నిరాశపరిచేలా ఉంది. జేఈఈ మెయిన్‌లో టాప్ 5 పర్సంటైల్ పొందిన మన అత్యుత్తమ విద్యార్థులకు.. ఏడాదికి కేవలం రూ. 2.75 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 3.75 లక్షల ప్రారంభ జీతాలేనా? ఈ విషయంలో మనం ఏదైనా తప్పు చేస్తున్నామా? అని ఆయన వీడియోలో ప్రశ్నించారు. నిజానికి ఈ కాలేజీలో ప్రవేశం పొందేందుకు లక్షలాది మందిపై మెరుగైన ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. ఇంతచేసీ NIT కాలికట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత చాలా మందికి టైర్-1 నగరాల్లో ప్రాథమిక జీవన వ్యయాలను భరించేంత జీతాలు మాత్రమే లభించడం విచారకరమని అన్నారు. దీనిపై నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం దర్యాప్తు చేయాలని పెరి వీడియోలో కోరారు. 98.5 పర్సంటైల్ ర్యాంక్ ఉన్న విద్యార్థులు ఏడాదికి కేవలం రూ. 3 లక్షల ప్రారంభ ఆఫర్లను పొందుతున్నారు. మరోవైపు కఠినమైన ఐదేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీని పూర్తి చేసిన బిఆర్క్ గ్రాడ్యుయేట్లు కేవలం రూ. 2.75 లక్షల ఫ్లోర్ జీతాలు మాత్రమే కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.
ప్లేస్‌మెంట్ డేటా ప్రకారం దేశంలోని అగ్రశ్రేణి ప్రతిభ కనబరచిన విద్యార్ధులకు నెలకు రూ. 25,000 కంటే తక్కువ జీతానికి ఎంపిక చేస్తే.. భారత్ ఉన్నత స్థాయి విద్యా సాధన, పారిశ్రామిక ప్రయోజనం మధ్య అంతరాన్ని ఎలా పూరిస్తుంది? అని పెరి ప్రశ్నించారు. పెరి లేవనెత్తిన ఈ ప్రశ్న పరిశ్రమ, విద్యా వ్యవస్థ రెండింటినీ విమర్శించేలా ఉంది. దీనిపై ‘బీటెక్ బబుల్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలో విస్తృత చర్చ జరుగుతుంది. సగటు భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థికి అధిక జీతం వచ్చే ఉద్యోగం అనేది కేవలం కల అని ఈ డేటా సూచిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




